హైదరాబాద్ , జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు పాతనగరం వీధి వీధిలో అత్యంత కన్నుల పండుగగా కొనసాగాయి. తెల్లవారు జామునుంచే అమ్మవారి ఆలయాలన్నీ కిటకిటలాడాయి. చార్మినార్ భాగ్యలక్ష్మీ, లాల్ దర్వాజా సింహవాహిని, హరిబౌలి బంగారు మైసమ్మ, గౌలిపురా మహంకాళి మందిరం, అక్కన్న మాదన్న దేవాలయాలతో పాటు ఉప్పుగూడ మహంకాళి మాత మందిరాలు భక్త జన సందోహంతో నిండి పోయాయి. వివిధ దేవాలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం నుంచే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకున్నారు. తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, శివ సత్తుల ఆటలు, యువకుల కేరింతల మధ్య ప్రతి వీధి అమ్మవారి స్మరణలో మునిగి తేలాయి. డప్పు సన్నాయిలతో బోనాల జాతర ధూమ్ ధామ్ గా కొనసాగింది. డప్పు చప్పుళ్లతో పోతురాజుల విన్యాసాలతో ఘటాల ఉరేగింపుతో గల్లీ గల్లీ తీన్మార్ మోతలతో మారు మ్రోగి పోయింది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించు కోవటానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. జన సందోహంతో ఆలయాలన్నీ నిండిపోయాయి.
అంబురానంటిన బోనాల సంబురాలు
Leave a Comment