అమరావతి జులై3,(ఇయ్యాల తెలంగాణ ):
ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ 108 వ్యవస్థను ఆంధ్ర ప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఈ వ్యవస్థకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది. ఆపదలో ఉన్న ఎవరైనా 108 కి కాల్ చేస్తే తక్షణమే వారి ముంగిటకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగి కోరుకున్న ఆసుపత్రికి నిమిషాల వ్యవధిలో తీసుకువెళ్లి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడేందుకు 108 వ్యవస్థ దోహద పడిరది.
2019లో కేవలం 531 అంబులెన్సులు ఉంటే వైయస్ జగన్ సీఎం అయ్యాక 2020లో అధునాతన సౌకర్యాలతో కొత్తగా 412 అంబులెన్స్లు ప్రారంభించారు. ఇందుకోసం రూ.96.50 కోట్లు వెచ్చించారు. అలాగే 2022 అక్టోబర్లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ఎక్కువ కాలం ప్రయాణించి మూలన పడే స్థితిలో ఉన్న అంబులెన్సుల స్థానంలో 146 కొత్త అంబులెన్సులను తాజాగా జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.34.79 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా ఏడాదికి 108 సేవల కోసం వెచ్చిస్తున్న వ్యయం అక్షరాలా రూ.188.56 కోట్లు.ఆపదలో ఉన్న ఏ ఒక్క ప్రాణం పోకూడదన్న తపన, తాపత్రయంతో రాష్ట్రంలో 108 వాహనాల వ్యవస్థను బలోపేతం చేశారు. సోమవారం ఉదయం తాడేపల్లి లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నూతన 108 సర్వీసులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు.