సికింద్రాబాద్, మే 11 (ఇయ్యాల తెలంగాణ) : ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి,దండ్రులకు భారంగా మారకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు నిదర్శనమని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజక వర్గం పరిధిలోని ముషీరాబాద్, మారేడుపల్లి రెవిన్యూ మండలాలకు సంబంధించి సితాఫలమండీ, బౌద్దనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు సంబంధించిన సుమారు రూ. 205 లక్షలకు పైగా విలువ చేసే 204 కళ్యాణ లక్ష్మి, షాదిముబారాక్ చెక్కులను, రూ. 13లక్షలకు పైగా విలువ చేసే 28 CMRF చెక్కులను పద్మారావు పంపిణీ చేశారు.
సితాఫలమండి లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన అర్హులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా పద్మా రావు మాట్లాడుతూ నిరుపేద ప్రజల సంక్షేమానికి వివిధ సంక్షేమ పధకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు పరుస్తున్నదని గుర్తుచేశారు. పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు CMRF ను సద్వినియోగం చేసుకుంటున్నామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. అర్హులకు రేషన్ కార్డులను అందిస్తామని తెలిపారు. షాది ముబరాక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ పధకాల లబ్దిదారులు దళారీలెవ్వరికీ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ క్యాంపు కార్యాలయం నెంబరు 040-27504448 కు ఫిర్యాదు చేయవచ్చని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు మాధవి రెడ్డి, అయ్యప్ప, కార్పొరేటర్లు రాసురి సునిత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి, తెరాస యువ నేతలు తీగుళ్ళ కిషోర్ కుమార్ గౌడ్ ,తీగుళ్ళ కిరణ్ గౌడ్, తీగుళ్ళ రామేశ్వర్ గౌడ్, రాజేశ్ గౌడ్ గుండవేణి తో పాటు ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.