వరంగల్, ఆగస్టు 25, (ఇయ్యాల తెలంగాణ) : ములుగు అసెంబ్లీ పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి సీతక్క బరిలో ఉండనున్న నేపథ్యంలో? బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతి ఖరారయ్యారు. నక్సలైట్ నేపథ్యం ఉన్న వీరిద్దరూ బ్యాలెట్ పోరులో తలపడనున్నారు. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంటే… అధికార బీఆర్‌ఎస్ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి సవాల్ విసిరింది. కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దాదాపు సిట్టింగ్ లకే సీట్లు కేటాయించిన గులాబీ బాస్ కేసీఆర్…. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కొత్త వారికి చోటు ఇచ్చారు. ఇందులో అనూహ్యంగా ములుగు సీటు నుంచి నుంచి ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్న ఉన్న బడే నాగజ్యోతి పేరును ఖరారు చేశారు. బలమైన నాయకురాలిగా పేరున్న సీతక్కును ఢీకొట్టేందుకు అభ్యర్థి విషయంలో చాలా కసరత్తే జరిగిందన్న చర్చ నడుస్తోంది.ములుగు నియోజకవర్గం అభ్యర్థిగా బడే నాగజ్యోతి పేరు ప్రకటనతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అసలు ఎవరీ ఈ నాగజ్యోతి అనే చర్చ గట్టిగా జరుగుతోంది. నిజానికి ములుగు అనగానే అందరికి గుర్తుకువచ్చే పేరు సీతక్క. ఇక్కడ్నుంచి ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు కూడా ఇదే. అయితే సీతక్క ఓ మాజీ నక్సలైట్ గా అందరికీ తెలిసిన విషయమే. నిత్యం ప్రజల్లో ఉండే నాయకురాలిగా సీతక్కకు పేరుంది. అయితే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గులాబీ జెండాను ఎగరవేయాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో పక్కా వ్యూహాన్ని రచించింది. అందులో భాగంగానే బడే నాగజ్యోతిని తెరపైకి తీసుకువచ్చింది.
బడే నాగజ్యోతి… ఈమె దివగంత నక్సలైట్ బడె నాగేశ్వర్ రావు కుమార్తె. 2018లోజరిపిన ఎన్‌కౌంటర్లో నాగేశ్వర్ రావు చనిపోయారు. నాగజ్యోతి మామ బడే చొక్కా రావు అలియస్ దామోదార్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం నాగజ్యోతి…. ములుగు జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ములుగు జిల్లాలోని ఎస్‌ఎస్ తడ్వాయి మండలం కలవపల్లి గ్రామానికి చెందిన నాగజ్యోతి…. ఎమ్మెస్సీ పూర్తి చేసింది. 2019లో మొదటిసారిగా సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత గులాబీ గూటికి చేరింది. తడ్వాయి మండలం నుంచి జెడ్పీటీసీగా విక్టరీ కొట్టింది. ఆ తర్వాత జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ గా ఎన్నికైంది. జెడ్పీ ఛైర్మన్ గా కుసుమ జగదీశ్ మరణం తర్వాత ప్రస్తుతం జెడ్పీ ఛైర్ పర్సన్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది బీఆర్‌ఎస్ అధినాయకత్వం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క…గతంలో మావోయిస్టుగా పని చేసింది. 1997లో ఆమె పోలీసులకు సరెండర్ అయ్యారు. ప్రజాజీవితంలోకి వచ్చిన ఆమె… ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఓయూలో పీహెచ్డీ కూడా కంప్లీట్ చేసింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా సీతక్క…. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి ములుగు నుంచి బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.మొత్తంగా ఒకరేమో మాజీ నక్సలైట్, మరొకరేమో బలమైన నక్సలైట్ కుటుంబ నేపథ్యం ఉన్న నాగజ్యోతి ఎన్నికల బరిలో ఉండటంతో ములుగు అసెంబ్లీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు. అయితే ఈ ఎన్నికల్లో గెలుస్తానని నాగజ్యోతి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.