హైదరాబాద్, అక్టోబరు 11, (ఇయ్యాల తెలంగాణ );హైదరాబాద్ జిల్లాలో కీలక నియోజకవర్గమైన కూకట్ పల్లి టికెట్ కోసం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య గట్టిపోటీ నెలకొంది. సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటే కూకట్ పల్లి టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 30న పోలింగ్ అంటూ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి.హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలక నియోజికవర్గం అయిన కూకట్ పల్లిలో కాంగ్రెస్, బీజేపీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. నేతలు టిక్కెట్లు తమకంటే తమకేనని, ఎవ్వరికీ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విడివిడిగా ఎవరికి వారే ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు పాదయాత్రలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం కూకట్ పల్లి టికెట్ పంచాయితీపై మౌనంగా ఉన్నాయి.కూకట్ పల్లి నియోజికవర్గంలో కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకొని పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత, సరైన గుర్తింపు ఉండదంటున్నారు స్థానిక నాయకులు. స్థానిక నేతలకు కాకుండా స్థానికేతరులకు టికెట్ ఇస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ప్రతిఘటన చేయడానికి కూడా వెనకడబోమని అధిష్టాలనకు గట్టి సంకేతాలు పంపుతున్నారు.కూకట్ పల్లి కాంగ్రెస్ అభ్యర్థిని తానే అంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు సంబంధం లేని కొందరు వ్యక్తులు కాంగ్రెస్ గుర్తు, నాయకుల ఫొటోలతో ఈసారి టికెట్ తమకే అంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు అభ్యర్థుల పట్ల పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. కాగా నియోజకవర్గంలో ప్రధానంగా ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ సామాజిక కోణంలో సేటిలేర్ వ్యక్తిని బరిలో దింపాలని ఆలోచిస్తుండగా దానికి స్థానిక నాయకత్వం మాత్రం సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. తాము సిఫార్సు చేసిన నాయకుడిని మాత్రమే అభ్యర్థిగా ప్రకటించాలని స్థానిక నాయకత్వం నిరసన గళం వినిపిస్తుంది.అయితే సినీ నిర్మాత బండ్ల గణేష్ ఈసారి కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే దానికి ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని, రేవంత్ రెడ్డి తనకు అవకాశం ఇస్తానని చెప్పినా తనకు టికెట్ అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తనకు ముఖ్యమన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీలోనూ ఇలాంటి అంతర్గత కుమ్ములాటలే కొనసాగుతున్నాయి. మేడ్చల్ (అర్బన్) జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి ఈసారి కూకట్ పల్లి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు ఏకంగా అరడజను మంది టికెట్ ఆశావహులు ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఆశావహులకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా వారి మధ్య పోటీని మరింత పెంచి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయం, ఎక్కువ మంది ఆశావహులు,అభ్యర్థులపై స్పష్టత తదితర కారణాల వల్ల రెండు జాతీయ పార్టీలు కూకట్ పల్లి స్థానాన్ని మొదటి విడతలో పెండిరగ్ లో పెట్టే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలోపు అభ్యర్థుల ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.