కేంద్ర బలగాల పహారాలో తెలంగాణ

హైదరాబాద్‌, అక్టోబరు 23, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీసు సిబ్బందికి సహాయంగా ఏడు కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు వచ్చేశాయి. ఇవి తొలి విడత బలగాలు కాగా త్వరలో మరిన్ని కేంద్ర బలగాలు రానున్నాయి. రాచకొండ పోలీస్‌ సిబ్బందితో కలిసి ఈ కేంద్ర బలగాలు పలు నియోజకవర్గాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ వంటి కవాతు నిర్వహించనున్నాయి.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డి ఎస్‌ చౌహన్‌ తెలిపారు. ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాత నేరస్తులను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బైండోవర్‌ చేస్తున్నామన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అవసరమైన ప్రదేశాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అక్రమ నగదు తరలింపు వంటి నేరాలను అడ్డుకునేందుకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నమని, సరైన పత్రాలు లేకుండా నగదు తదితర వస్తువులు తీసుకెళితే సీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు.మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా ఎలాంటి సమస్యలు అవకతవకులు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా భారీ భద్రత ఏర్పాటు చేసేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపనుంది. గతంలో పది వేల కేంద్ర బలగాలు తెలంగాణ వ్యాప్తంగా భద్రత కింద ఉంటే.. ఈసారి దాన్ని రెట్టింపు చేస్తూ 20 కేంద్ర బలగాలను హోం శాఖ కేటాయించింది. ఒక్కో కంపెనీలో అస్సాం రైఫిల్స్‌ బోర్డర్స్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, శశాస్త్ర సీమా నుండి 80 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. ఈ సిబ్బంది అంతా తెలంగాణ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు.కేంద్ర పారా మిలిటరీ బలగాలు లెక్కల్లో చూపని నగదు అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దుల దగ్గర ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా కీలకమైన ప్రాంతాల్లో తాత్కాలిక భద్రత తనిఖీ శిబిరాలను ఏర్పాటు చేస్తాయి. ముందస్తుగా ఈ బలగాలు ఫ్లాగ్‌ మార్చను నిర్వహించడం ద్వారా ఓటర్లలో భయాన్ని పోగొట్టడానికి సమస్య ఆత్మక ప్రాంతాల్లో దశలవారీగా భద్రత కింద ఉండనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....