చరిత్రను మార్చేందుకు BJP తుగ్లక్‌లా ప్రవర్తిస్తోంది.. పశ్చిమ బెంగాల్‌ CM మమతా బెనర్జీ ఆగ్రహం

కోల్‌ కత్తా అక్టోబర్‌ 26 (ఇయ్యాల తెలంగాణ ):ప్రతిపక్షాలను దెబ్బతీయడం కోసమే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తన రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు.తాజాగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ దర్యాప్తు సంస్థ దాడుల వ్యవహారంలో బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ దాడులు నిర్వహించి.. బీజేపీ డర్టీ గేమ్‌ ఆడుతోందని మండిపడ్డారు. కేవలం విపక్ష పార్టీల నేతలపైనే దాడులు జరుగుతున్నాయని.. బీజేపీ నాయకుల ఇళ్లపై మాత్రం దాడులు జరగడం లేదని, అసలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు అడుగు పెట్టడం లేదని అన్నారు. ఒక్క బీజేపీ నాయకుడి ఇంటిపైనా అయినా ఐటీ దాడులు జరిగాయా? అని ఆమె ప్రశ్నించారు. తనకు అడ్డుగా ఉన్నారన్న నెపంతో.. ప్రతిపక్ష పార్టీల్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఈ దాడులు చేయిస్తోందంటూ ఆమె ధ్వజమెత్తారు.పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సిఫార్సుపై కూడా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హఠాత్తుగా ఈ అంశాన్ని ఎందుకు తెరవిూదకు తీసుకొచ్చారని నిలదీశారు. నోట్ల రద్దు, జీఎస్టీ గురించి ప్రస్తావిస్తూ.. చరిత్రను మార్చాలనుకునే మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌లా బీజేపీ మారిందని ఆరోపించారు. ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ కావాలని బీజేపీ చెబుతోందని.. అయితే వాస్తవానికి దానర్థం ‘సబ్కా సాథ్‌ సబ్‌కా వినాశనం’ అని అభివర్ణించారు. విశ్వభారతి ఠాగూర్‌దేనని, అయితే ఆ యూనివర్శిటీకి యునెస్కో వారసత్వ హోదా లభించినప్పుడు ఫలకాల్లో ఆయన పేరు లేదని ఆమె గుర్తు చేశారు. ఇది ఆయన్ను అవమానపరచడమేనని ఉద్ఘాటించారు.ఇదిలావుండగా.. కోట్లాది రూపాయల విలువైన రేషన్‌ పంపిణీ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌ మంత్రి జ్యోతిప్రియా మాలిక్‌ నివాసాలపై గురువారం ఈడీ దాడులు చేసింది. అలాగే.. రాజస్థాన్‌లో పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి జైపూర్‌, సికార్‌లోని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ ప్రాంగణాలపై దాడులు జరిగాయి. అంతేకాదు.. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడికి కూడా సమన్లు వచ్చాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....