చికెన్‌ ధరలు దాటేసిన టమాటా

తిరుపతి, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ ) ; తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మదనపల్లె మార్కెట్లో కిలో రూ.224 ధర పలికిన టమాటా… చికెన్‌ ధరలను దాటేసింది. మార్కెట్‌ లో టమాటా ధరలు పీఎస్‌ఎల్వీ రాకెట్‌ గా పైపైకి దూసుకుపోతున్నాయి. తాజాగా టమాటా ధర కోడి మాంసం ధరలను దాటేశాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్లో రికార్డు మోత మోగిస్తూ డబుల్‌ సెంచరీ కొట్టింది. మంగళవారం రూ.224 ధర పలికింది. అదేవిధంగా అనంతపురం జిల్లా కక్కలపల్లి టమాటా మార్కెట్‌ 15 కిలోల టమాటా బుట్ట రూ.3,200కు అమ్ముడుపోయింది. అంటే కిలో టమాటా సుమారు రూ.215 పలికింది. ఈ మార్కెట్‌ చరిత్రలోనే టమాటా ధర ఇదే అత్యధికమని వ్యాపారులు చెబుతున్నారు. కనగానపల్లి మండలం పాతపాలెంకు చెందిన బళ్లారి రాజు మంగళవారం కక్కలపల్లి మార్కెట్‌కు 90 బుట్టల టమాటాలు విక్రయానికి తీసుకురాగా..వీటిల్లో 79 బుట్టలు రూ.3,200 చొప్పున అమ్ముడుపోయాయి.మార్కెట్‌ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లితోపాటు మిగతా కూరగాయల ధరలు కూడా రాకెట్‌ లా ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గిందని రైతులు అంటున్నారు. ఏపీ, మహారాష్ట్రలలో వర్షాలు, వరదల కారణంగా సరుకు రవాణాకు అంతరాయం కలిగిందని వ్యాపారులు చెబుతున్నారు. కొందరు వ్యాపారులు సరుకును బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా రూ.200 పైనే ఉంది. టమాటాతో ఇతర కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటడంతో వంటల్లో టమాటా వాడకాన్ని తగ్గించేశారు. టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి కూరగాయలు, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అయితే కోడి మాంసం ధరలు తగ్గుతున్నాయి. కొన్నిచోట్ల చికెన్‌ ధర కంటే టమాటా ధరలు అధికంగా ఉన్నాయి. మార్కెట్‌ లో కేజీ చికెన్‌ ధర రూ.200`రూ. 220గా ఉంది. టమాటాలు కంటే చికెన్‌ కొనడమే బెటర్‌ అని సామాన్యులు భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయల ధరలతో పాటు నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ఏపీ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా రైతు బజార్లు ద్వారా సబ్సిడీకే టమాటాలను అందిస్తుంది. కిలో టమాటా రూ. 50లకే ఇస్తుంది. దీంతో తెల్లవారుజాము నుంచే జనాలు రైతు బజార్ల ముందు టమాటాలు కోసం క్యూ కడుతున్నారు. రైతు బజార్లలో ఒక్కొక్కరికి ఒక్కో కిలో టమాటాలు మాత్రమే ఇస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....