హైదరాబాద్, జూలై 23, (ఇయ్యాల తెలంగాణ) :
వివాహితకు తుపాకీ గురిపెట్టి అత్యాచారానికి పాల్పడిన మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ ముగిసింది. ఐదు రోజులపాటు నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు విచారించారు. నాగేశ్వరరావును హయత్‌నగర్ న్యాయస్థానంలో హాజరుపర్చారు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా నాగేశ్వరరావును ప్రశ్నించారు. ఏసీపీ పురషోత్తం రెడ్డి మాజీ సీఐ నాగేశ్వరరావును ప్రశ్నించినట్లు తెలిసింది. వనస్థలిపురంలో ఓ అపార్ట్‌మెంట్ బాధితురాలిపై అత్యాచారం జరిగిన ప్రాంతం నుంచి కారు ప్రమాదానికి ఇబ్రహీంపట్నం చెరువు వరకు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. హయత్ నగర్ కోర్టు ముందు హాజరుపరిచి నిందితుడు నాగేశ్వరరావును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.జులై 7 తనపై సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 10వ తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకుని తర్వాత రోజు చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత దర్యాప్తు చేయాలని వనస్థలిపురం పోలీసులు హయత్‌నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయగా.. కోర్టు అంగీకరించింది. ఈనెల 18న నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకొని సరూర్‌నగర్ పీఎస్‌లో ప్రశ్నించారు. మహిళతో నాగేశ్వరరావుకు ఉన్న పరిచయాలు, ఇతర విషయాల గురించి పోలీసులు వివరాలు సేకరించారు. ఇప్పటికే బాధితురాలితో పాటు ఆమె భర్త, పలువురు సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న పోలీసులు.. వాటి ఆధారంగా నాగేశ్వరరావును ప్రశ్నించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని వనస్థలిపురం పోలీసులు వెల్లడిరచారు. ఈ కేసులో కస్టడీ రిపోర్టు కీలకం కానుంది.