తెరపైకి మళ్లీ ఉమ్మడి రాష్ట్రం
రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్` తెలంగాణ మళ్లీ కలిసిపోనున్నాయా? లేదా? మరో పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే ఉంచుతారా? విభజనతో అన్ని విధాలా నష్టపోయిందని, పీకి అన్యాయం జరిగిందని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ప్రధాని మోడీ తలచుకుంటే ఏపీ` తెలంగాణ రాష్ట్రాలను కలిపేయడం పెద్ద కష్టమేవిూ కాబోదంటున్నారు పరిశీలకులు. కాదంటే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే యోచన కూడా ఉండి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ఈ మేరకు మోడీ స్కెచ్ వేశారని, అందులో భాగంగానే ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’ ‘హైదరాబాద్ రాజధాని’ వ్యాఖ్యలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విభజన తర్వాత రాజధాని హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయిందని, దాంతో ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, హైదరాబాద్ ను మళ్లీ పూర్వం మాదిరిగా ఏపీకి కలిపేయమని అడిగితే ఎలా ఉంటుందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు? అలా ఐతే హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమనండి.. తప్పులేదు అంటున్నారాయన.రాష్ట్ర విభజనను రద్దు చేసి, రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ పూర్వంలాగే సమైక్యంగా మార్చేయండి అభ్యంతరం లేదు అని బొత్స మంగళవారం ఒక సందర్భంలో అన్నారు. మాట్లాడిన సందర్భం ఏదైనా ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికి కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తోంది. ఉత్తరాదిలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ దక్షిణాదిలో కూడా పాగా వేయాలని అనేక యత్నాలు చేస్తూ వస్తోంది.అయితే అవేవిూ పెద్దగా ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. ముందుగా తెలంగాణపై కన్నేసిన కమలదళం పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ పైన, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పైనా తీవ్ర స్థాయి విమర్శలతో చెలరేగిపోతున్నారు. కేంద్రంలో బీజేపీ రహిత పరిపాలనకు బాటలు వేయాలంటూ విపక్షాలను కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. విభజన సమయంలో ఏపీకి నష్టం జరిగిందని ప్రధాని మోడీ కొన్నిసార్లు స్వయంగా చెప్పడం గమనార్హం. దీంతో కేసీఆర్ స్పీడుకు, టీఆర్‌ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలనే వ్యూహాలు మోడీ రచిస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అయ్యాయి. రాజధాని నగరంలేని ఏపీకి హైదరాబాద్ నే మరో పదేళ్ల పాటు రాజధానిగా కొనసాగించాలనే యోచన ఇందులో భాగమేనంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హావిూ ప్రత్యేక హోదా ఇప్పుడు ‘ముగిసిన అధ్యాయం’ అని కేంద్రం పార్లమెంట్ లో తాజాగా మరో మారు స్పష్టం చేయడంఈ సందర్భంగా గమనార్హం. ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల ఆర్థికంగా నష్టపోతున్న ఏపీకి కొంత వెసులుబాటు కల్పించాలని, లేదా తెలంగాణతో మళ్లీ కలపడం ద్వారా మేలు చేయాలనే ఆలోచన కూడా కేంద్రం పెద్దల్లో, ముఖ్యంగా ప్రధాని మోడీలో ఉందంటున్నారు.రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు ప్రధాని మోడీ తలుచుకుంటే.. తెలుగు రాష్ట్రాలను మళ్లీ విలీనం చేయొచ్చని, లేదా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి, ఆదాయంలో భాగం పంచవచ్చని, అదీ కాకపోతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి తెలంగాణలో కేసీఆర్ ను బలహీనం చేయడం, అదే సమయంలో ఏపీలో బలం పెంచుకునే అవకాశం కల్పించుకోవడం అన్న యోచనతో మోడీ తన వ్యూహాలకు పదును పెడుతున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మోడీ స్కెచ్ లో భాగమే ఏపీ మంత్రి బొత్స ఉమ్మడి రాజధాని, ఇరు రాష్ట్రాల విలీనం అంశాలను ప్రస్తావించారని పరిశీలకులు భావిస్తున్నారు