నల్లగొండ, మార్చి 29 (ఇయ్యాల తెలంగాణ) : ధరల పెంపులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజల నడ్డి విరిచేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో బాగంగా సోమవారం నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం గుండెపూరి గ్రామంలో వంటావార్పు కార్యక్రమం వైఎస్సార్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రజలపై భారం మోపుతున్న టీఆర్ఎస్, బీజేపీ లు నువ్వా నేనా అన్నట్లుగా ధరలు పెంచుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్, చార్జీలు పెంపుతో టిఆర్ఎస్, బీజేపీ లకు రానున్న రోజుల్లో భంగపాటు తప్పదని అన్నారు. మధ్య తరగతి ప్రజలను బానిస బతుకులు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్నారని ఆరోపించారు.తగిన సమయంలో టీఆర్ఎస్, బీజేపీ లకు బుద్ది చేప్పకపోతే ప్రజల బతుకులు బుగ్గి పాలవుతాయని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్న ఏపూరి సోమన్న ను ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్ షర్మిల ప్రజలను కోరారు. కార్యక్రమం లో వైఎస్ఆర్ టీపి అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నీలం రమేష్, చైతన్య రెడ్డి, బి సత్యవతి, నాగమణి, కల్పనా గాయత్రీ, బోర్గి సంజీవ, చింతల అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- ధరల పెంపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే తీరు : వైఎస్ షర్మిల
ధరల పెంపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే తీరు : వైఎస్ షర్మిల
Leave a Comment