నాకు 14 నెలల వనవాసం.. రాజాసింగ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 23, (ఇయ్యాల తెలంగాణ ); గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆదివారం బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టారు. గతేడాది బీజేపీ అధిష్ఠానం ఆయన్ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మళ్లీ గోషామహల్‌ నియోజకవర్గ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. దీంతో దాదాపు 14 నెలల తర్వాత ఆయన బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టారు. అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా ఆదివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. సస్పెన్షన్‌ ఎత్తివేతపై కిషన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా సింగ్‌ మాట్లాడుతూ.. రాముడికి 14 ఏళ్ల వనవాసం ఉంటే.. బీజేపీ అధిష్టానం తనకు 14 నెలలు వనవాసం వేశారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తెలంగాణ పార్టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. మొదటి జాబితాలో 52 మంది పేర్లను పార్టీ జాతీయ నాయకత్వం ఆదివారం ప్రకటించిందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మున్సిపల్‌ చైర్మన్లు, తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కించుకున్నట్లు చెప్పారు. దసరా తర్వాత రెండో జాబితా విడుదల అవుతుందని వెల్లడిరచారు.ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ప్రధాని 5 సభల్లో, అమిత్‌ షా 3 సభల్లో పాల్గొన్నారని, ఈ నెలలో మరోసారి అమిత్‌ షా పర్యటన ఉంటుందన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం వస్తారని,  దసరా తర్వా బీజేపీ ఎన్నికల కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటామని అన్నారు.తెలంగాణను గతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పరిపాలించాయని, ఈ రెండు కుటుంబ, అవినీతి పార్టీలకు అతీతంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కుటుంబ, అవినీతి పరిపాలన విూద తాము పోరాటం చేస్తున్నామని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారుకాంగ్రెస్‌ పార్టీ 60 ఏళ్లుగా తెలంగాణను మోసం చేస్తూ వస్తే, బీఆర్‌ఎస్‌ గత తొమ్మిదేళ్లుగా ప్రజలను దగా చేస్తోందన్నారు. ప్రజల్లో బీజేపీకి బలం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యక్తిగతంగా డోర్‌ టు డోర్‌ వెళ్లి ప్రతి ఓటరును కలుస్తామని, బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను వివరిస్తామని అన్నారు.అధికార పార్టీ గత కొన్ని రోజులుగా ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. పాలక పార్టీ ఒత్తిడికి తలొగ్గి విని ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఒత్తిడులకు అధికారులు లొంగద్దని సూచించారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, వారికి బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాజాసింగ్‌ సస్పెన్షన్‌ ఎత్తివేయడం శుభపరిణామమని, చాలా కాలం తర్వాత ఆయన బీజేపీ ఆఫీసుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాజా సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సస్పెన్షన్‌ ఎత్తేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు చెప్పారు. జనసేన అధినేతతో ప్రాథమికంగా కలిసి మట్లాడామని, పొత్తుపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రజలందరికి విజయదశమి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....