నేడు గురు పూర్ణిమ – GURU POURNAMI

 

భక్తి , జూలై 3 : ఇయ్యాల తెలంగాణ 

“గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః !!

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః” !!

అని అంటారు. సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు. 

వ్యాస భగవానుడు పుట్టిన పుణ్యతిథి ఆషాడ శుద్ద పౌర్ణమి, అందుకే ఈ రోజున గురు పౌర్ణమిగా జరుపుకొంటారు. ఈ పూర్ణిమ నాడు వ్యాసభగవానుడిని పూజిస్తే, ధ్యానించిన వారికి తన స్వరూప దర్శనం కలుగుతుందని వ్యాసభగవానుడే చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది, అందుకే యావద్భారతదేశం పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా వ్యాసమహర్షిని పూజించి తరిస్తోంది. అపూర్వ అద్భుత వేదాలను అందించిన బ్రహ్మదేవుడు ఆయన, కాని ఆయనకు నాలుగు ముఖాలు ఉండవు. స్థిరచరాలన్నింటా వ్యాపించిన విష్ణుదేవుడు ఆయన, కాని ఆయనకు రెండు చేతులే ఉంటాయి. శిష్యుల అజ్ఞానాన్ని హరించే హరభగవానుడు ఆయన, కాని ఆయనకు నొసట నేత్రంలేదు. 

ఎవరైతే సత్యవతీ పరాశరుల పంటగా, నది మధ్య ఉన్న దీవిలో నల్లటిరంగుతో జన్మించి క్రిష్ణ ద్వైపాయనుడుగా పేరు గడించాడో, ఎవరైతే పుడుతూనే వేదాలను వల్లించి, ఆ తరువాత చిక్కుముడులతో ఎకాకృతిగా ఉన్న వేదరాశిని సంస్కరించి, విభజించి, భోధించి, వ్యాప్తి చేసి వేదాంగభాస్కరుడుగా కీర్తి పొందాడో, ఎవరైతే పురాణ ఇతిహాసాల్లో సులభతరం చేసిన వేదసారాన్ని జొప్పించి పంచమ వేదమైన మహాభారతాన్ని, భక్తిరస ప్రధానమైన భాగవతం మొదలైన పద్దెనిమిది పురాణాలనూ రచించి, అమూల్యమైన ఆర్ష సాహిత్యాన్ని లోకానికి అనుగ్రహించిన జ్ఞానమయప్రదీపుడుగా విశ్వవిఖ్యాతి చెందాడో, ఎవరైతే బ్రహ్మవిద్యను అభ్యసించి, న్యాయ ప్రస్థానమైన బ్రహ్మ సూత్రాలను రచించి జగద్గురువైన శ్రీకృష్ణ స్వరూపిడిగా ప్రకటితమయ్యాడో ఆ మహానుభావుడే వ్యాస భగవానుడు.

గురువు తన జ్ఞాన భోధద్వారా శిష్యుడిలోని అజ్ఞానాన్ని పోగొట్టి, పూర్ణ స్వరూపుడిగా తీర్చిదిద్దే త్రిమూర్తి స్వరూపుడు. అజ్ఞానంనుంచి మేల్కొలిపే దేవుడే గురు దేవుడు. ఇటువంటి గురుశిష్య సంప్రదాయాన్ని ఏర్పరిచిన గురువులకు గురువే వ్యాస భగవానుడు. ఈయన వల్లనే ఆధ్యాత్మిక గురువుకు ఆర్ష సంస్కృతిలో ఎనలేని గౌరవస్థానం దక్కింది, అందుకే గురు పరంపరలో నిలిచినా గురు మహాత్ములందరినీ జ్ఞాన ప్రదాతలుగా సంస్మరించుకొని తమతమ గురువుల్లో వ్యాసభగవానులను దర్శించి, ఏటేటా వారిని కృతజ్ఞతతో ప్రత్యేకంగా పూజించే పండుగే గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ. గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. 

ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి, వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.

“గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”అంటారు. సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు. 

“గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా” అంటాడు భక్త కబీర్ దాస్. అదీ మన భారతీయ సంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరు తమ గురువుల్ని తలుచుకొని పూజించాలి. 

అందరికి గురు పూర్ణిమ అయిన వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. 

ఓం శ్రీ గురుభ్యోనమః

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....