హైదరాబాద్ జులై 7,(ఇయ్యాల తెలంగాణ ): టిఆర్‌ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు.తరువాత అయన మాట్లాడుతూ ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం పట్ల కెసిఆర్ ను ఎంతగానో కలిసింది. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తాం. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని అన్నారు. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైంది. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి. తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి, తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదని అన్నారు.
గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు ప్రధానమంత్రి. కానీ రాష్ట్ర పునర విభజన హావిూ అయినా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మాత్రము మొండి చేయి చూపించారు. కేవలం 520 కోట్ల రూపాయలతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేట లో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారు. తెలంగాణకు 520 కోట్ల రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కి 20000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ తీసుకుపోయిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు.
ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హావిూని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హావిూని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు. తొమ్మిదేళ్లపాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరు. మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ప్రధాని పర్యటనను పూర్తిగా బహిష్కరిస్తున్నాం, ఎవరము హాజరుకామని అన్నారు.
ధరణి విదేశీ చేతిలో ఉందన్న రేవంత్ రెడ్డి గుర్తించాల్సిన మాట. కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీ చేతుల్లోనే ఉంది. రేవంత్ రెడ్డి నోట్లోన్చి వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదు. ఆయనకు మతిస్థిమితం లేదు. ఇది సెక్రటేరియట్ కింద వేల కోట్లు ఉన్నాయని చేసిన పిచ్చి ఆరోపణలు అందరికీ గుర్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపి పైన ఒక మాట ఎందుకు మాట్లాడడు. మోడీని బిజెపిని ఒక మాట అనకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అందుకే గాంధీ భవన్లో గాడ్సే దూరిండు అని మేము చెప్పామని అన్నారు. రేవంత్ రెడ్డి 100% ఆర్‌ఎస్‌ఎస్ మనిషి, బిజెపి మనిషి. మోడీని పల్లెత్తు మాట అనకుండా కాపాడుతున్న వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే. రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సైతం అందించి విచారణ చేయించుకోవచ్చు. ధరణి ద్వారా జరిగిన లబ్ధిని మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రజలకు చెప్తం. ఈ అంశాన్ని ప్రజలే తెలచాలని కోరుతాం. సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్ రెడ్డి… ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అయితే ఓర్వలేక పోతున్నారు. ఆయన భూ దందాలు ధరణి ద్వారా సాధ్యమవుతలేదని ఆయన అక్కసని వ్యాఖ్యానించారు.