ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం

 

జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): విశ్వవిద్యాలయం 18వ వార్షికోత్సవ సభలో టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతర వైదిక అంశాలకు సంబంధించి ప్రపంచంలో ఎవరికి ఏ సందేహం కలిగినా, ఆధార సహితంగా నివృత్తి చేయగలిగే స్థాయికి వేద విశ్వవిద్యాలయం చేరుకోవాలని టీటీడీ ఈవో  ఎవిధర్మారెడ్డి పిలుపునిచ్చారు. వేద విద్య, వేద విజ్ఞానం ఆధునిక సమాజానికి అత్యవసరమైన నేటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయం ప్రపంచ చిత్రపటంపై ప్రత్యేక స్థానం సాధించుకోవాలని చెప్పారు.    శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 18వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ముందుగా సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో ఈవో  ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈవో మాట్లాడుతూ,  వేద విద్యను విశ్వవ్యాప్తం చేసి సమాజం ధర్మబద్ధంగా నడవాలనే ఉద్దేశంతో టీటీడీ వేద విశ్వవిద్యాలయం ప్రారంభించిందన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపి మంచి వైపు నడిపించే గురుతర బాధ్యతను వేద విద్యార్థులు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.  కలియుగంలో వేద అభ్యాసకుల ద్వారా ధర్మాన్ని నిలబెట్టే ఆలోచనతోనే స్వామివారు వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  విద్యార్థులు వేదాలను అభ్యసించడమే కాకుండా వేద విజ్ఞానాన్ని  నూతన మార్గంలో ప్రపంచానికి అందించేలా  కృషి చేయాలన్నారు. అలాగే తాళపత్ర గ్రంథాల్లోని  విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి అందించేందుకు కృషి చేయాలని కర్తవ్య బోధ చేశారు.జన్మ, మృత్యు రహస్యాలు,  మానవ శరీరాన్ని నడిపించే శక్తికి సంబంధించిన విజ్ఞానం పై ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి నిర్దిష్ట పరిశోధనలు చేసి ప్రపంచం శ్రీ  వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైపు చూసేలా పని చేయాలన్నారు. యోగ, క్రియ, ధ్యానం నేటి సమాజానికి ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ప్రపంచం సంపాదించడం,  కూడబెట్టుకోవడం అనే అంశాలపైనే ప్రయాణం చేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మానవులకు ఆరోగ్యం, శాంతి, ఉపశమనం కల్పించే కేంద్రంగా విశ్వవిద్యాలయం తయారు కావాలన్నారు.

తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించి అవసరమైన వాటిని పుస్తక రూపంలో తెచ్చే ప్రక్రియ కొనసాగుతోందని ఈవో చెప్పారు.  ఇది ప్రపంచంలోనే గొప్ప తాళపత్ర గ్రంథాలయంగా తయారు కావాలని ఆయన చెప్పారు. యూనివర్సిటీ ఆచార్యులు మరిన్ని పరిశోధన ప్రాజెక్టులు వచ్చేలా పని చేసి, రాబోయే రోజుల్లో యూనివర్సిటీ ఆర్థిక అవసరాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం అందించేలా కృషి చేయాలని ఆయన చెప్పారు.జేఈవో  సదా భార్గవి మాట్లాడుతూ,  వేదాలకు ఆధునిక పరిజ్ఞానానికి ఉన్న సంబంధాన్ని వివరించే దిశగా వేద విశ్వవిద్యాలయం మరింతగా కృషి చేయాలన్నారు. విశ్వవిద్యాలయం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.  దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల కంటే ముందుగానే జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. అధీంద్రియ విజ్ఞానంపై  ప్రత్యేక కోర్సు ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఆమె అభినందించారు. గత ఆరు నెలల కాలంగా  యూనివర్సిటీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని ఆమె చెప్పారు.     ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, ప్రపంచంలో వేదం కోసం పనిచేస్తున్న ఏకైక యూనివర్సిటీ శ్రీ  వేంకటేశ్వర వేద యూనివర్సిటీ మాత్రమే అని చెప్పారు. వేద విద్యతో పాటు,  వైదిక అంశాలను కూడా ప్రపంచానికి తెలియజేసే కృషి ఇక్కడ జరుగుతోందన్నారు .యూనివర్సిటీ లో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వేద,  ఆగమ, పౌరోహిత ల్యాబ్‌ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వేద విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య రాధేశ్యాం,  పిఆర్‌ఓ డాక్టర్‌ బ్రహ్మాచార్యులు, ఆచార్య రామకృష్ణ తోపాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....