బీజేపీ కార్యకర్త సాయి గణేష్ బలవన్మరణానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

 సనత్ నగర్, ఏప్రిల్ 23 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ కార్యకర్త సాయి గణేష్  బలవన్మరణానికి నిరసనగా బిజెపి సనత్ నగర్  పరివార్ సభ్యులు బిజెపి కార్యకర్తల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్త సాయి గణేష్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక తెరాస రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రోద్బలంతో పోలీసులు కేసు నమోదు చేసి సాయి గణేష్ ను  మానసిక వ్యధకు గురిచేయడంతోనే ఈ నెల 14 వ తేదీన ఖమ్మం లోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయి గణేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆందోళన వ్యక్తం చేశారు. సాయి గణేష్   మరణ వాంగ్మూలంలో సైతం కక్ష్యసాధింపు కోసం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రోద్బలంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు విస్పష్టంగా పేర్కొన్నప్పటికీ పోలీసులు దీనిపై ఎలాంటి చర్య తీసుకోనందున  సనత్ నగర్ బిజెపి కార్యకర్తల ఆధ్వర్యంలో బల్కంపేట్ లోని సాయిబాబా గుడి వద్ద నుండి బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో  బీజేపీ పరివార్ సభ్యులందరూ పాల్గొని దివంగత సాయి గణేష్ కు నివాళులు అర్పించారు. ఈ సంఘటనపై అధికార ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతానికి పాల్పడకుండా ఏదైనా స్వతంత్ర సంస్థతో సమగ్రమైన దర్యాప్తు జరిపించి దోషులెవరైనా సరే ఉపేక్షించరాదని, స్థాయీ భేదం లేకుండా శిక్షించాలని డిమాండ్ చేసారు. అధికార తెరాస ప్రభుత్వం రోజు రోజుకు ప్రజలలో విశ్వాసం కోల్పోతూ నిరాశ నిస్పృహలకు గురవుతోందని, అది జీర్ణించుకోలేక, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బలపడుతున్న బీజేపీ ని అణగదొక్కడానికి పార్టీ శ్రేణులపై వివిధ రకాల వేధింపులతో భయపెట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. కానీ క్రమశిక్షణ, నిబద్ధత గల బీజేపీ నాయకులూ, కార్యకర్తలు ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడరని, వచ్చే శాసన సభ ఎన్నికలలో తెరాస కథ ఇక కంచికే అని జోస్యం చెప్పారు. 

ఈ ర్యాలీలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ర కార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, దిశ సభ్యుడు చరణ్ సింగ్, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత్, ఆకూరి శ్రీనివాస్ రావు,  వై శ్రీనివాస్ రావు, ఐల శ్రీనివాస్ గౌడ్, రాజేశం, మల్లికార్జున్ గౌడ్, సుధాకర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారని పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....