భాగ్యనగరంలో ఇయ్యాల బోనాలు

భాగ్యనగరంలో ఇయ్యాల  బోనాలు

హైదరాబాద్‌, జూలై 15, (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ బోనాల సందడి జూలై 17 తో పూర్తవుతుంది. గోల్కొండ కోటలోని మహంకాళి ఆలయం దగ్గర మొదలైన లష్కర్‌ బోనాలు, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల విూదుగా ఓల్డ్‌ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. బోనాలు వేడుకలకు అమ్మవారి ఆలయాలు మాత్రమే కాదు వీధుల్నీ కూడా వేపాకులతో అలంకరిస్తారు. హైదరాబాద్‌ `సికింద్రాబాద్‌ జంటనగరాలతో పాటూ తెలంగాణ వ్యాప్తంగా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోనూ బోనాలు జరుపుకుంటారు. చివరి వారం పాతబస్తీ లాల్‌ దర్వాజ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. చివరిగా ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపుతో  బోనాల జాతర ముగుస్తుంది. అమ్మవారికి భక్తితో సమర్పించే పప్పు అన్నాన్ని బోనం అంటారు. ఇది భోజనం అనే మాట నుంచి వచ్చింది. ‘భోజనం’ ప్రకృతి ‘బోనం’ వికృతి అని చెబుతారు. బోనం తలకెత్తుకున్న వారిని ‘అమ్మశక్తికి ప్రతీకగా భావించి, భక్తులు బోనమెత్తిన వారి పాదాలను కడుగుతారు. బోనాన్ని సమర్పించే పక్రియను ‘ఊరడి’ అంటారు. పల్లె ప్రాంతాలలో ‘పెద్దపండుగ, ఊరు పండుగ’ అని పిలుస్తారు. బోనం ఎత్తిన రోజు లేదా మర్నాడు భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తయారు చేసి బండిపై ఊరేగింపుగా తీసుకువెళతారు. దీనిని ‘ఫలహారం బండి’ అంటారు.

ఘటోత్సవం ` తొట్టెల ఊరేగింపు

సమృద్ధిగా వానలు కురవాలని, ప్రకృతి పచ్చగా ఉండాలని, అంతా ఆరోగ్యంగా వర్థిల్లాలని ప్రార్థిస్తూ ‘సాకబెట్టు’ పేరుతో పసుపు, వేపాకు, పచ్చకర్పూర, సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో శక్తిమాతలను అభిషేకిస్తారు. ఒక కుండ (ఘటం)ను చక్కగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దానిపై ఉంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళతారు. ఘటోత్సవంతో పాటు పిల్లలు ఆరోగ్యంతో, పూర్ణాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ ఉయ్యాల తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తారు. వీటిని పూలతో తయారుచేస్తారు. వెదురుబొంగులను రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు. 

ఇవి మూడు అంతస్తుల నుంచి ఏడు అంతస్తుల వరకూ ఉంటాయి. పండుగ ముగిసిన రోజు డప్పు వాయిద్యాలు, పాటలు, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం. ప్రకృతిశక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతంలో ఉంది.  ప్రకృతి తల్లిలాంటిది. ఆ తల్లి ఒడిలో సేదతీరాలంటే ఆమెను పూజించాలి. అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. మానవ మనుగడకు అదే శ్రీరామరక్ష. అందుకు భిన్నంగా వ్యహరించినప్పుడు, ప్రకృతి ప్రకోపిస్తే విపత్కర పరిణామాలు ఎదురుకాక తప్పదు. వాటిని అధిగమించేందుకు మారుతున్న రుతువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వివిధ రూపాలు, పేర్లతో కొలువైన గ్రామదేవతలను వేడుకుంటూ జరుపుకునే పండుగే బోనాలు. ఏటా ఆషాడ మాస తొలి ఆదివారం బోనాల జాతర మొదలై ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది. ప్రధాన ఆలయాలతో పాటు వాడవాడలా కొలువై ఉన్న గ్రామదేవతలను కాళీమాత రూపాలుగా పూజిస్తూ బోనాలు సమర్పించుకుంటారు. ఆషాడంలో ఆడబిడ్డ ఇంటికి వచ్చిన భావించి  పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ? ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు.

ఈ ఏడాది లాల్‌ దర్వాజ బోనాలకు సర్వం సిద్ధమైంది. పాతబస్తీలో కొలువైన సింహవాహిని మహంకాళి అమ్మవారికి జూలై 16 ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చి బోనం సమర్పంచనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. సోమవారం జులై 17న ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు జరగుతుంది. 

అదే రోజ రంగం నిర్వహిస్తారు. భవిష్యవాణి వినేందుకు, ఘటాల ఊరేగింపును చూసేందుకు వేలాది భక్తజనం తరలివస్తారు.  బోనాలు వేడుకలకు ప్రత్యేకంగా పొడవాటి కర్రలకు రంగు కాగితాలు అమర్చిన తొట్టెలు రూపొందిస్తారు. ఒక్కో బృందం ఒక్కో తొట్టెను అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ప్రసాదం ఇంటికి తీసుకొచ్చి బంధుమిత్రులతో కలసి విందు ఆరగిస్తారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....