మారిపోయిన వాసల మర్రి

నల్గోండ, ఆగస్టు 9, (ఇయ్యాల తెలంగాణ ); వాసాలమర్రి పేరు గుర్తుందా… అదే నండి కేసీఆర్‌ దత్తత గ్రామం.. ఇప్పుడు శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు దత్తత తీసుకోవడంతో ఈ గ్రామం రూపు రేఖలు మారుతున్నాయ. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు 2020 నవంబర్‌ 1న సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2021 జూన్‌ 22న వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించి గ్రామ సమస్యలను అడిగి తెలుసు కున్నారు. గ్రామంలోని దళితవాడలో పర్యటించి దళితుల ఇళ్లను పరిశీలించి స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. వాసాలమర్రి అభివృద్ధికి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్‌ ను స్పెషల్‌ ఆఫీసర్‌ గా సీఎం కేసీఆర్‌ నియమించారు.గ్రామంలోని పూరి గుడిసెలు పురాతన ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ లేఅవుట్‌ తయారు చేసి విశాలమైన రోడ్లతో పాటు కమ్యూనిటీ, అంగన్‌వాడీ భవనం, ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఆట స్థలం, సెప్టిక్‌ ట్యాంకులను ఆధునిక హంగులతో మాస్టర్‌ ప్లాన్‌ ను రూపొందించారు. దేశానికే రోల్‌ మోడల్‌ గా వాసాలమర్రిని తీర్చిదిద్దేందుకు 152 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ రూపురేఖలను మార్చనున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాల నిర్మాణానికి మొత్తం రూ.3.58 కోట్లు, మూడు అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు రూ.75 లక్షలు కేటాయించారు. అదనంగా ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించారు.గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 30 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత ఈ పనులన్నీ ప్రారంభమై భవన నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి. వాసాలమర్రి గ్రామానికి మాత్రమే కాకుండా పరిసర గ్రామాలైన కొండాపురం, తిరుమలాపురం, గోపాల పూర్‌, శ్రీనివాసపూర్‌ లకు కూడా విద్యుత్‌ ను అందించేందుకు మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తౌెంది.వాసాలమర్రిలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధితో పాటు గ్రామస్తులందరికీ వారి వారి స్థానాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. దానికి అనుగుణంగానే గ్రామంలోని 103 పక్కా ఇళ్లు, మరో 481 పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, గుడిసెలను కూల్చివేసి వాటి స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. విశాలమైన రోడ్లు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల కోసం కూడా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇళ్ల నిర్మాణంతోపాటు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది.సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో గ్రామంలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని గ్రామ సర్పంచి ఆంజనేయులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామ రూపురేఖలే మారుతున్నాయని, మాస్టర్‌ ప్లాన్‌ పూర్తయితే దేశానికే వాసాలమర్రి రోల్‌ మోడల్‌ గా నిలుస్తుందని సర్పంచ్‌ చెబుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....