తిరుపతి, జూన్ 05 (ఇయ్యాల తెలంగాణ) : సార్వత్రిక ఎన్నికలు 2024 టిడిపిలో కొత్త జోష్‌ను నింపాయి. మరి ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నాని తిరుచానూరు లో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారికి కుటుంబ సమేతంగా తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్దకు చేరుకున్న పులివర్తి నాని దంపతులకు తెలుగు తమ్ముళ్లు బాణాసంచా పేల్చి, పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత పులివర్తి నాని దంపతులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు శేష వస్త్రంతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పులివర్తి నాని విూడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టిడిపి జెండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి సీటును టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు కానుకగా ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రోత్సహించిన నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన శుభ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి 501 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పట్టు టిడిపి ముఖ్య నాయకులు చంద్రశేఖర్ నాయుడు, తిరుపతి రూరల్ మండలం అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి , రాష్ట్ర టిఎన్టియుసి కార్యనిర్వాహణ కార్యదర్శి అమ్మినేని మధు, చంద్రగిరి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తిరుచానూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, తిరుపతి రూరల్ యువత హరి రామ్ రెడ్డి ,వాసు,చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు తీర్చుకున్న చంద్రగిరి MLA పులివర్తి నాని
Leave a Comment