రజాకార్‌ Filesపై కమలం ఆశలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రజాకార్‌ సినిమా ట్రైలర్‌ విడుదల అయింది . ట్రైలర్‌ చూసిన చాలా మంది రెండు రకాలుగా విడిపోయారు. ఒకరు మత విద్వేషాలను పెంచే ప్రయత్నమని విమర్శలు చేస్తూండగా.. నిజాలు చెబితే తప్పేమిటని మరొకరు వాదిస్తున్నారు. ఈ సినిమా వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చాయి. అసలు రాజకీయాల కోసమే ఈ సినిమా తీశారు. ఇక రాజకీయం కాకుండా ఎలా ఉంటుంది. చరిత్ర తెలియని మూర్ఖులు మత విద్వేషాల కోసం ఈ సినిమా తీశారని.. తాము అడ్డుకుంటామని కేటీఆర్‌ ప్రకటించారు. ఇది రాజకీయంగా  కలకలం  రేపే సినిమా కావడంతో రాజకీయ పార్టీలు తమ విధానాల్ని ప్రకటిస్తున్నాయి. అనుకూలంగానో వ్యతిరేకంగానో ప్రకటనలు చేస్తున్నాయి. కశ్మీర్‌ ఫైల్స్‌ ,  కేరళ స్టోరీ వంటి సినిమా భారతీయ జనతా పార్టీ ఎజెండాలో భాగంగా మారాయి. ఆ సినిమాల వెనుక బీజేపీ నేతలు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు కానీ వాటికి  బీజేపీ చేసిన  ప్రమోషన్‌ అంతా ఇంతా కాదు. స్వయంగా ప్రధాని మోదీ వాటి గురించి ఎన్నికల సభల్లో ప్రస్తావించారు.  వాటిని బీజేపీ ఓన్‌ చేసుకుంటే.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న  చోట నిషేధిస్తున్నారు. బీజేపీ రాజకీయాల్లో సినిమాలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాల్సిన పనిలేదు. ప్రజల అభిప్రాయాలను మార్చగల శక్తివంతమైన సాధనం సినిమా అని ఆపార్టీ అగ్రనేతలు నమ్ముతారు.   అందుకే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కూడా  రజాకార్‌ సినిమాను ప్లాన్‌ చేసారు. రజాకార్‌ ఫైల్స్‌ తీస్తామని పలుమార్లు ప్రకటించారు బండి సంజయ్‌. గుట్టుగా నిర్మాణం ప్రారంభించారు. దాదాపుగా పూర్తయింది. ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేశారు. నిజాం కాలంలో రజాకార్ల మిలీషియా చేతుల్లో హైదరాబాద్‌ రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలు ఈ చిత్ర కథాంశం.  తెలంగాణ బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి  ఈ సినిమా నిర్మాత.   వచ్చే ఎన్నికల్లో దీనిని ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోందనే ప్రచారం కూడా ఉంది.  హైదరాబాద్‌ రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలు ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది.  రజాకార్లు, ఆపరేషన్‌ పోలో, నిజాం పాలన చివరి రోజుల్లో జరిగిన దురాగతాలు, హైదరాబాద్‌ రాష్ట్రాన్ని భారతదేశంలోకి తీసుకురావడంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వీరోచిత పాత్ర గురించి ఇందులో చూపిస్తున్నారు.  

సమరవీర్‌ క్రియేషన్స్‌ పతాకంపై నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.    బీజేపీ నేతలు మాత్రం.. జరిగిన చరిత్రను చూపిస్తున్నామని అంటున్నారు. హైదరాబాద్‌ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టుగా సినిమా వర్గాలు చెబుతున్నాయి. నిజాం పాలనలో హైదరాబాద్‌ రాష్ట్రంలో పారామిలిటరీ వలంటీర్‌ దళాన్ని రజాకార్లుగా పిలుస్తారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలో వీరి విస్తరణ జరిగింది. హైదరాబాదులో ముస్లింల పాలనను కొనసాగించడానికి, భారత్‌లో విలీనానికి వ్యతిరేకంగా వీరి ప్రతిఘటించి పోరాటం చేశారు. అయితే.. అప్పట్లో వారు హిందువులతో పాటు ముస్లింలను కూడా టార్గెట్‌ చేసుకుని దాడులు చేశారని చెబుతారు. అయితే ట్రైలర్‌ మొత్తం హిందువుల్ని .. రజాకార్లు ఊత కోచ కోస్తున్నట్లుగా ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీన్లు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ సహా ఇతరులు  విమర్శలు గుప్పిస్తున్నారు. అడ్డుకుంటామని కేటీఆర్‌అంటున్నారు. సెన్సార్‌ అంగీకరించదని చెబుతున్నరు. కశ్మీర్‌ ఫైల్స్‌,  కేరళ స్టోరీ తరహాలో రజాకార్‌ కూడా ఉంది. అందుకే ఆ సినిమా రిలీజ్‌ అయితే  రాజకీయాల్లో అన్నీ పక్కకుపోతాయి. అదే అజెండా అవుతుంది. అప్పుడు ప్రజల ఓటింగ్‌ ప్రయారిటీ మారిపోతుంది. బీజేపీ కోరుకునేది కూడా అదే. బాక్సాఫీసులు బద్దలవకపోయినా..  బ్యాలెట్‌ బాక్సులు మాత్రం రికార్డులు సృష్టిస్తాయన్న నమ్మకంతో ఉంది. మరి బీజేపీ అనుకున్నది సాధిస్తుందా ?

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....