రవాణా శాఖ Revenue ప్రక్షాళన షురూ !

నిజామాబాద్‌, జూన్‌ 4, (ఇయ్యాల తెలంగాణ) : తేలంగాణలో పలు జిల్లాలలో ఆర్టీఓ కార్యాలయాలలో , బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. నల్గొండ, కరీంనగర్‌, మహబూబాబాద్‌, సిద్ధిపేట, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలలోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలపై ఒకేసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆర్టీఏ ఏజెంట్లు, ఆఫీసర్లను విచారిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఇన్నాళ్లూ అడ్డూ అదుపూ లేకుండా సాగిన రవాణా శాఖ అధికారుల ఆగడాలు తారాస్ఠాయికి చేరుకున్నాయి. దాదాపు గత ఐదారేళ్లుగా రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌ పోస్టులలో భారీ ఎత్తున అవినీతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ మంగళవారం జరిపిన దాడుల్లో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. ఏకంగా కార్యాలయాలలోనే పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. ఇన్ని జరుగుతున్నా ఆర్టీఏ ఉన్నతాధికారులు మౌనంగా ఉన్నారంటే క్షేత్ర స్థాయిలో జరిగే తంతు మొత్తం వీళ్లకి తెలిసే జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా శాఖలో ఆన్‌ లైన్‌ సర్వీసులు అంటూ ఎంత ఊదరగొట్టినా..ఆర్టీఏ బ్రోకర్లదే హవా. ఆర్టీఏ శాఖలో కొందరు ఉన్నతాధికారులు ప్రైవేటుగా కొందరు బ్రోకర్లను నియమించుకుని వాహనదారులనుంచి అడ్డగోలుగా లంచాలు వసూళ్లు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యావరేజ్‌ న ఒక్కో చెక్‌ పోస్ట్‌ లో ఏడాదికి ఆరు నుంచి ఎనిమిది కోట్ల మేరకు అవినీతి జరుగుతోందని అంచనా.పర్మినెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే టూ వీలర్‌ కు ఓ రేటు, కారుకు మరో రేటు, స్కూళ్లు, కాలేజీల వంటి బస్సుల లైసెన్స్‌ లకు మరో రేటు, రవాణా వాహనాల ఫిట్‌ నెస్‌ రెన్యువల్‌ కు ఓ రేటు, లెర్నర్‌ లైసెన్సుకు కంప్యూటర్‌ పరీక్షకు ఓ రేటు చొప్పున వసూలు చేస్తున్నారు. ఒకవేళ వాహనదారులు నేరుగా వెళితే ఏదో ఒక సాకు చెప్పి వాళ్లను మళ్లీ మళ్లీ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ చివరాఖరికి బ్రోకర్లే శరణ్యం అనేటట్లు చేస్తున్నారు. ఇలా బ్రోకర్ల ద్వారా వెళ్లే అప్లికేషన్లకు పెన్సిల్‌ తో ఓ కోడ్‌ ఉంటుంది. ఆ కోడ్‌ చూడగానే వెంటనే పనులు చకచకా అయిపోతాయి.

అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు సైతం అక్రమాలకు అడ్డాగా మారాయి. తెలంగాణ`ఆంధ్రా సరిహద్దులో ఉన్న అశ్వారావుపేట చెక్‌ పోస్టులో భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. ఇక్కడ సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది కోట్ల అవినీతి జరుగుతోందని అంచనా. అప్లికేషన్లు, అనుమతులు అన్నీ కరెక్ట్‌ గానే ఉన్నాయంటూ లంచం ఇవ్వకుండా వెళుతున్నా లారీలను వెంబడిరచి కేసులు పెట్టి వాళ్ల నుంచి 20 వేల రూపాయలు జరిమానాలు విధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో బడి బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలకు ఫిట్‌ నెస్‌ రెన్యువల్‌ సర్టిఫికెట్లు కేవలం బ్రోకర్ల ద్వారా వస్తేనే పనులు జరుగుతున్నాయిరంగారెడ్డి జిల్లాలో ఓ కీలక కార్యాలయానికి కొద్దినెలల క్రితం కొత్త అధికారి వచ్చాక ప్రైవేటు వ్యక్తులను ఆర్టీఏ కార్యాలయంలోకి అనుమతించడం ఆపేశారు. సదరు అధికారి సెలవులో ఉన్నప్పుడు కిందిస్థాయి అధికారులు దళారులకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. పాత వాహనాలకు యజమాని వివరాలు మార్చాలన్నా ఇక్కడ డబ్బు ముట్టజెప్పాల్సిందే. వాహనాల ఫిట్‌ నెస్‌ పరీక్షకు ఆటోకు రూ.300, ట్రాక్టర్‌ కు రూ.500 చొప్పున ఇవ్వాలి. కామారెడ్డి జిల్లాలో ఓ అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులో కొద్ది కాలం క్రితం ఏకంగా 21 మంది రవాణా అధికారులు డిప్యూటేషన్‌ పై కొనసాగారు. హై లెవెల్‌ పైరవీలతో చాలాకాలం పాటు తిష్టవేసిన వారిని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పింపింది. ఇక్కడ ఉన్న ఉన్నతస్థాయి అధికారులు దాదాపు 20 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించుకున్నారు. వారి ద్వారా రోజుకు 15 లక్షలకు పైగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చూసుకుంటే ఆర్టీఏ శాఖలో ఇలాంటి వసూల్‌ రాజాలను ప్రోత్సహించింది బీఆర్‌ఎస్‌ సర్కారే అన్నది అర్థమవుతోంది.తెలంగాణలో అవినీత రహిత పాలన అందిస్తామని, అవినీతికి ఎవరు పాల్పడినా ఉపేక్షించమని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు అనుగుణంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే దశాబ్దాలుగా ఆర్టీఓ కార్యాలయాలలో పేరుకుపోయిన లంచగొండుల పనిపట్టే పనిలో ఉన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో లంచాలతో బదిలీలను ఆపుకుంటూ ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసుకుని కూర్చున్న అధికారులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపించనుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....