న్యూఢిల్లీ, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) :
భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీజేఐ ఎన్వీ రమణ ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పదవి విరమణ చేసిన రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ సభాపతి ఓంబిర్లా, ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు. దేశానికి ద్రౌపది ముర్ము రెండో మహిళా రాష్ట్రపతి కాగా.. తొలి గిరిజన రాష్ట్రపతి కావడం విశేషం.
నూతన రాష్ట్రపతి మాట్లాడుతూ చిన్న ఆదివాసీ గ్రామం నుంచి వచ్చిన తాను రాష్ట్రపతి హోదాలో దేశ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ముర్ము హావిూ ఇచ్చారు. దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. పార్లమెంట్ లో జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలి ప్రసంగం చేశారు. అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్ ఆజాదికా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోందన్నారు. తాను రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఆదివాసీల విజయమన్నారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి పదవి చేపట్టినా పేద, దళిత, పీడిత ప్రజలకు ప్రతినిధిగా కొనసాగుతానని ముర్ము స్పష్టం చేశారు. తాను రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గొప్ప గౌరవంగా, గర్వంగా భావిస్తానని అన్నారు. భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, మహిళలు స్వశక్తితో ముందుకు సాగుతున్నారని ఆమె అన్నారు.