విదేశీ సంస్థల చేత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆక్స్‌ఫాం యత్నం : సీబీఐ

న్యూఢీల్లీ, ఏప్రిల్‌ 20 : (ఇయ్యాల తెలంగాణ) :  విదేశీ విరాళాల నియంత్రణ చట్టం క్రింద లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం విదేశీ సంస్థల ద్వారా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆక్స్‌ఫాం ఇండియా సంస్థ ప్రయత్నించిందని సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ`అఃఎ) ఆరోపించింది. ఈ లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించకపోవడంతో తన కార్యకలాపాలను కొనసాగించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపించింది. ఈ సంస్థపైనా, దాని సభ్యులపైనా నమోదు చేసిన ప్రథమ సమాచార నివేదిక లో ఈ ఆరోపణలు చేసింది. ఈ సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం దరఖాస్తు 2022 జనవరిలో తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.ప్రభుత్వేతర సంస్థ ఆక్స్‌ఫాం ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను ఉల్లంఘించినట్లు సీబీఐ సోమవారం ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం విదేశీ సంస్థల సహకారం తీసుకోవాలని ప్రయత్నించిందని తెలిపింది. యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, యూరోపియన్‌ దేశాల ద్వారా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించిందని తెలిపింది. ఈ సంస్థకు వస్తున్న నిధులతో ఆందోళనలకు మద్దతిస్తోందని పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన నిధుల్లో 20 శాతం మాత్రమే అడ్మినిస్ట్రేటివ్‌ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతి ఉందని, ఈ నిబంధనలను ఉల్లంఘించి, 33 శాతం నిధులను వినియోగిస్తోందని తెలిపింది.ఆదాయపు పన్ను శాఖ గత ఏడాది సెప్టెంబరులో ఆక్స్‌ఫాం ఇండియా, సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ సంస్థల్లో సర్వే నిర్వహించింది. ఆక్స్‌ఫాం ఆఫీస్‌ బేరర్ల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ఆ సంస్థ ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లను, ఈ`మెయిల్‌ ఉత్తర, ప్రత్యుత్తరాలను పరిశీలించింది. ఈ అంశాలపై దర్యాప్తు జరపాలని సీబీఐని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నెల 5న ఆదేశించింది. మనీలాండరింగ్‌ జరిగిందేమో గుర్తించడం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు నివేదించాలని కూడా ఆదేశించింది.ఆదాయపు పన్ను శాఖ కనుగొన్న అంశాల ఆధారంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. విదేశీ నిధులను దారి మళ్లించడం కోసం నిబంధనలను ఉల్లంఘించడానికి ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ప్రయత్నించిందని తెలిపింది. ఈ సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరణ కాకపోవడంతో విదేశీ నిధులను సేకరించడం సాధ్యం కాదు. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ పొందడం కోసం భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఐర్లాండ్‌ ఎంబసీని ఆక్స్‌ఫాం ఇండియా ఆశ్రయించినట్లు ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. ఆక్స్‌ఫాం మాజీ సీఈఓ అమితాబ్‌ బెహర్‌ 2022 ఫిబ్రవరి 15న రాసిన ఈ`మెయిల్‌లో ఈ విషయం ఉన్నట్లు తెలిసింది. బొగ్గు పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించే విధంగా స్థానిక యూనియన్లను రంగంలోకి దించడం కోసం ఎన్విరానిక్స్‌ ట్రస్ట్‌కు ఆక్స్‌ఫాం ఇండియా నిధులను సమకూర్చినట్లు వెల్లడైంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....