హుజుర్‌నగర్‌ నియోజకవర్గం BRS ప్రజా ఆశీర్వాద సభలో KCR

హుజుర్‌నగర్‌ అక్టోబర్‌ 31(ఇయ్యాల తెలంగాణ ): రైతుబంధు పథకంతో ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేయడంతో కేసీఆర్‌ కలను నిజం చేసిన మొగోళ్లు.. మొనగాళ్లు నా తెలంగాణ రైతులు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.రైతుబంధు పదాన్ని ఈ ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్‌ అని సీఎం తెలిపారు. రైతుబంధు మంచిది కాదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తిడుతున్నాడు. దుబారా అని అంటున్నాడు. స్వామినాథనే హైదరాబాద్‌కు వచ్చి రైతుబంధు పథకాన్ని ప్రశంసించారు. ఇలా రైతుబంధు వద్దనే వారికి తగిన బుద్ధి చెప్పాలి. నవంబర్‌ 30న గుద్దుడు గుద్దితే పోలింగ్‌ బాక్సులు పగిలిపోవాలి అని కేసీఆర్‌ అన్నారు.రాష్ట్ర మలి దశ ఉద్యమ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. ‘1956లో చిన్న పొరపాటు తెలంగాణ కాంగ్రెస్‌ చేసినందుకు 56 సంవత్సరాలు తెలంగాణ ఏడ్చింది. కరెంటు లేదు. మంచినీళ్లు లేవు. అయితయనుకున్న ప్రాజెక్టులు కాలే.. గొడగొడ ఏడ్చినం. ఉద్యోగాలు పోయినయ్‌.. నిధులు పోయినయ్‌. కండ్లు అప్పగించి చూసినం. మళ్లీ 2001లో మళ్లీ మొదలు పెట్టి కొట్లాడితే.. ఇదే కాంగ్రెస్‌ మనల్ని మోసం చేసింది’ అన్నారు.తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి వాగ్భాణాలు సంధించారు. ‘మొన్న నేను ఉన్నది ఉన్నట్లు చెబితే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎగిరెగిరిపడ్డడు. నాగార్జున సాగర్‌ నెహ్రూ కట్టించారన్నడు.. మరి నేను కట్టించానని చెప్పానా? నెహ్రూ కట్టలేదని చెప్పానా? అబద్ధాలు చెప్పే అవసరం మాకుందా? కట్టాల్సిన చోట కట్టలేదు.. రావాల్సిన నీళ్లు వస్తవలేవు.. కుడికాలువకు ఎక్కువ నీళ్లు పెట్టుకున్నరు.. ఎడమ కాలువను నాశనం పెట్టించారని మొదటి నుంచి మొత్తుకుంటున్నం. ఇది జరుగుతున్న సత్యం’ అన్నారు.

ఒక్క మొగోడు లేకుండెనా.‘ఒక విషయం మాత్రం బాగా కండ్లారా చూశారు. ఇదే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నడు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బాజాప్తా ముఖ్యమంత్రితో అసెంబ్లీలో కొట్లాడుతున్నరు. అడిగిన జవాబు లేక చెప్పే తెలివిలేక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేచి ఒకమాట అన్నడు. విూరిట్లే మాట్లాడితే.. తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని మాట్లాడిరడు. ఇంత మంది కాంగ్రెస్‌ మంత్రులున్నరే.. అందులో ఒక్కడూ మొగోడు లేకుండనా? ఒక్క తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. మంత్రో.. ముఖ్యమంత్రిగా ఉండి అలా ఎలా మాట్లాడుతారు.. మేమంతా తెలంగాణ బిడ్డలం.. మా ముందే ఈ మాట అంటవా?.. అని లేచి నిలబడాలి.. అవసరమైతే రాజీనామా మొఖానికి కొట్టాలి. మరి ఎక్కడికిపాయే పౌరుషం.. ఇవాళ హుజూర్‌నగర్‌లో ఓట్లు కావాలి.. నల్లగొండలో ఓట్లు కావాలి.. నాగార్జునసాగర్‌లో ఓట్లు కావాలి.. కానీ తెలంగాణ ప్రజల బాధమాత్రం అవసరం లేదు. ఒక్కటే మాట మనవి చేస్తున్నా’నన్నారు.

పదవులు పంచుకొని గడ్డకెక్కారు.‘తెలంగాణ ఇస్తమని నమ్మబలికి 2004లో పొత్తు పెట్టుకొని గడ్డకు ఎక్కారు. మనిషికిన్ని మంత్రి పదవులు పంచుకుని గడ్డకెక్కారు. ‘తీర్థం పోదాం తిమ్మక్కంటే.. నువ్వు గుళ్లె నేను చలిలే’ అన్నట్లుగా అయిపోయింది. తీర్థం అయిపోయింది అధికారం వచ్చింది.. మంత్రి పదువులు వచ్చినయ్‌. తెలంగాణను వదిలిపెట్టారు. మనం వదల్లేదు.. కొట్టాడుకుంటూ కొట్లాడుకుంటూ పోయాం.. 14 ఏళ్లు గడిచిన తర్వాత తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడే ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణ కోసం దిగివచ్చారు. ఆ సమయంలో వీరంతా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా చేసిండా.. రాజీనామాలు చేయమంటే లాగులు తడిసిపోయినయ్‌. గజగజ వణుక్కుంటూ పోయారు.. కిందనో విూదనో మనం తెచ్చాం. తెచ్చిన తర్వాత ప్రజలకు చెప్పాను.. న్యాయం చెప్పండి ఎవరైతే తెలంగాణకు ఇంత వెలుగుపెడతరో.. ఎవరు తండ్లాండుతరో వాళ్లను గెలిపివ్వమని చెప్పాను. టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. పని చేసుకుంటూ పోతున్నాం’ అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....