ఆరోగ్య ప్రదాయిని బోడకాకర కాయలు

హైదరాబాద్‌, జూలై 07 (ఇయ్యాల తెలంగాణ) :Ñవిూద చిన్నపాటి బుడిపెలతో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అవేనండీ.. బోడకాకర కాయలు. కొన్ని ప్రాంతాల్లో వీటిని అడవి కాకర అని, కొందరు ఆగాకర కాయలు అని కూడా పిలుస్తారు. ఇవి కేవలం వర్షాకాలం సీజన్‌లోనే వస్తాయి. అయితే ఈ సీజన్‌లో వచ్చే ఈ కాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో వేపుడు, పులుసు, టమాటా కూర చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అయితే బోడ కాకరకాయలు మనకు ఎన్నో పోషకాలతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వీటిల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. కనుక ఈ సీజన్‌లో లభించే ఈ కాయలను విడిచిపెట్టకుండా తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బోడ కాకరకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు.

 రోగ నిరోధక శక్తికి..

100 గ్రాముల బోడ కాకరకాయలను తినడం వల్ల సుమారుగా 30 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. ఈ కాయల్లో 80 శాతం నీరు ఉంటుంది. ప్రొటీన్లు 3 గ్రాములు, ఫైబర్‌ 3 గ్రాములు, విటమిన్లు సి, ఎ, బి1, బి2, బి3, బి9, పొటాషియం, ఐరన్‌, క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్‌, జింక్‌, మాంగనీస్‌ వంటి పోషకాలు ఈ కాయల్లో అధికంగా ఉంటాయి. ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు సైతం వీటిల్లో అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ కాయలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. బోడకాకర కాయలలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక ఈ కాయలను తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఈ కాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో శరీరం ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి బయట పడవచ్చు.

అల్సర్లు, పైల్స్‌ ఉంటే..

బోడకాకర కాయలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. కనుక ఈ కాయలను తింటే సులభంగా జీర్ణం అవడమే కాదు, వీటిల్లో ఉండే లాక్సేటివ్‌ గుణాల కారణంగా ఈ కాయలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. సుఖ విరేచనం అయ్యేలా చేస్తాయి. ఈ కాయలన తినడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణాశయ అల్సర్లు, పైల్స్‌ ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. బోడకాకర కాయల గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కాయలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా ఈ కాయల్లో ఉండే ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక సాధారణ కాకరకాయ మాదిరిగానే ఈ కాయలు కూడా షుగర్‌ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. చేదు ఉండవు కనుక ఇష్టంగా తినవచ్చు. షుగర్‌ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి..

బోడకాకర కాయలలో యాంటీ ఇన్‌ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కారణంగా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ కాయలు ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ కాయలను తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా ఈ కాయల్లో ఫైబర్‌ ఉంటుంది కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఈ కాయల్లో ఉండే విటమిన్‌ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా ఈ సీజన్‌లో లభించే బోడకాకర కాయలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....
Related Post