ఏ ఆస్తి ఎవరికి..? వీలునామా లేకపోతే పంపకాలెలా?
హైదరాబాద్ జూలై 7 (ఇయ్యాల తెలంగాణ) : తల్లిదండ్రులందరూ తమ పిల్లల కోసమే ఆస్తుల్ని కూడబెడతారు. అయితే చాలామంది తమ మరణానంతరం ఆస్తి పంపకాలు ఎలా జరగాలి? అన్నది వివరిస్తూ వీలునామాను రాస్తారు. ఇలాంటప్పుడు ఏ పేచీ ఉండదు. ముఖ్యంగా కుటుంబంలో ఎలాంటి గొడవలకు తావుండదు. వారసులకు ఆస్తుల పంపిణీ దాదాపు సజావుగానే సాగుతుంది. ఇంకొందరు తాము బ్రతికి ఉండగానే ఆస్తుల్ని పిల్లలకు పంచి ఇచ్చి, వారివారి ఇష్టప్రకారం వాళ్ల వద్దే శేష జీవితం కానీ కొందరు వీలునామా రాయకుండానే చనిపోతారు. అలాంటప్పుడు ఆస్తుల పంపకాలు ఎలా? కొడుకులు, కూతుళ్లకు ఏ ఆస్తిని ఎలా విభజిస్తారు? అన్నది ప్రశ్న. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కూతుర్లుసహా వారసులందరికీ పెండ్లిళ్లు అయినా, కాకపోయినా తల్లిదండ్రుల స్వార్జితంలో చట్టప్రకారం వాటా ఉంటుంది.
హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం తల్లిదండ్రుల సంపాదనలో కొడుకులతో సమానంగా కూమార్తెలకూ భాగం వస్తుంది.వీలునామా లేకపోతే హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తులకు సంతానాన్ని తొలి ప్రాధాన్యతగా పరిగణిస్తారు. చట్టబద్ధమైన వారసులందరికీ సమానంగానే వాటాను పంచుతారు. వీలునామా ఉంటే, ఆస్తి తమ కష్టార్జితమే అయితే తల్లిదండ్రులు ఎవరికైనా ఇచ్చేయవచ్చు. పిల్లలెవరూ ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేరు.ఒకవేళ తాత, ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ సంపద అయితే తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారసులందరికీ సమాన వాటాలుంటాయి.ఒక వ్యక్తి ఒకటికి మించి ఎక్కువ పెండ్లిళ్లు చేసుకుంటే ఆ వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై తన ద్వారా జన్మించిన ప్రతీ ఒక్కరికీ హక్కు ఉంటుంది. తల్లి తీసుకున్న విడాకులతో సంబంధం లేకుండాఆస్తుల్ని పంచుకోవడానికి పిల్లలంతా అర్హులేనని చట్టాలు చెప్తున్నాయి.