ఆగస్టు నాటికి గులాబీ జాబితా
హైదరాబాద్, జూలై 27, (ఇయ్యాల తెలంగాణ) : బీఆర్‌ఎస్ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రెండు దశల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా? 60 మందిని జూలై 24న ప్రకటిస్తానని, మిగిలిన 59 మంది అభ్యర్థులను ఆగస్టు 24న ప్రకటిస్తానని కెసీఆర్ సెలవిచ్చారు. ఆగస్టు 24వ తేదీన ప్రకటించడానికి కెసీఆర్ ఓ లాజిక్ కూడా చెప్పారు రెండు తేదీలు కలిపి తన అదృష్ట సంఖ్య 6ని చెప్పారు. అయితే కెసీఆర్ ఇలా తొందరపడి అభ్యర్థులను ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.దాదాపు 14 మంది మంత్రులు, ఇతర పార్టీల నుంచి మారిన 16 మంది ఎమ్మెల్యేలకు తొలి దశలో టిక్కెట్లు దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ తో సహా 31 మందికి తొలి దశలో సీట్లు వస్తాయి అని ప్రచారం జరుగుతోంది. సర్వే నివేదికలను బట్టి జాబితాను మార్చడానికి పార్టీ అధినేతకు అవకాశం, సమయం ఉంటుందని బిఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ ఎన్నికల్లో కొత్త ముఖాలను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల కోసం డిమాండ్ ఉన్న నేపథ్యంలో వామపక్ష పార్టీలతో ముందస్తు ఎన్నికల పొత్తుకు కేసీఆర్ సిద్దంగా లేరు అని తెలుస్తోంది.
గత అనుభవాలను పరిశీలిస్తే ఎన్నికలు అనగానే కేసీఆర్ కు ఉత్సాహం ఉరకలేస్తుంది. 2019 జూన్‌లో పదవీకాలం ముగియడానికి తొమ్మిది నెలల ముందే అంటే 2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసారు. అదే రోజు 105 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సెప్టెంబర్ 6న ప్రకటించడానికి కారణం లేకపోలేదు. 6 కెసీఆర్ లక్కీ నెంబర్. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించే కేసీఆర్ ఈ సారి కూడా తొలి జాబితాను ప్రకటించడానికి ఉవ్వీళూరుతున్నారు. ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆగస్టు 24లోపు రెండు జాబితాలను ప్రకటిస్తానని ప్రకటించి అన్ని పార్టీలను అబ్బురపరుస్తున్నారు. మెజారిటీ రాజకీయ పార్టీలు సాధారణంగా అభ్యర్థుల జాబితాను ముందే ప్రకటించకుండా సస్పెన్స్ కొనసాగిస్తాయి.నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాయి. చివరి క్షణం వరకు ఉత్కంఠ నెలకొనేలా చేస్తాయి.