Congress లో గెలుపు ధీమా !

హైదరాబాద్‌, ఆగస్టు 12, (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు వ్యూహలు, ప్రతివ్యూహాలతో బిజీ అవుతున్నాయి. ఇదే సమయంలో గతంలో జరిగిన తప్పులను సవిూక్షించుకుంటున్నాయి. ఈ విషయానికొస్తే… కాంగ్రెస్‌ పార్టీ ఓ అసెంబ్లీ సీటు విషయంలో సీరియస్‌ గా ఆలోచిస్తోంది. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు… వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే… ఇప్పటికే ఎన్నికల మూడ్‌ లోకి వెళ్లిన పార్టీలన్నీ ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాల కారణంగా… ప్రధాన పార్టీలు చేజేతులా సీట్లను కోల్పోయాయి. ఈ విషయానికొస్తే రంగారెడ్డి జిల్లాలోని ఓ అసెంబ్లీ సీటు విషయంలో మాత్రం కాంగ్రెస్‌ ఏకంగా రెండుసార్లు బోల్తాపడిపోయింది. ఫలితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం…ఆ సీటులో పక్కాగా హస్తం జెండాను ఎగరవేయాలని గట్టిగా భావిస్తోంది. మరోవైపు అధికార పార్టీ కూడా… మరోసారి గెలవాలని భావిస్తుండగా… కమలం పార్టీ కూడా బలమైన అభ్యర్థిని దింపాలని చూస్తోంది. దీంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది.ఇబ్రహీంపట్నం….. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం. భువనగిరి పార్లమెంట్‌ సీటు పరిధిలో ఉంటుంది. గత చరిత్ర చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఈ సీటు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత కామ్రేడ్లకు అడ్డాగా మారింది. పొత్తులు, రాజకీయ పరిస్థితులతో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం… తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఇక్కడ టీడీపీ జెండానే ఎగిరింది. అయితే టీడీపీ నుంచి గెలిచిన మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి… బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి బరిలో ఉండి… మరోసారి గెలిచి ఇదే సీటు నుంచి హ్యాట్రిక్‌ విజయం అందుకున్నారు. నిజానికి ఈ సీటును 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. చేజార్చుకుంది. 

అభ్యర్థి ఎంపిక విషయంపై స్పష్టమైన విధానం లేకపోవటమే ఇందుకు కారణమైంది.రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున క్యామ మల్లేశ్‌ బరిలో నిలిచారు. టీడీపీ తరపున మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి , బీఆర్‌ఎస్‌ నుంచి చంద్రశేఖర్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే నిజానికి టికెట్‌ కోసం కాంగ్రెస్‌ నేత మల్‌ రెడ్డి రంగారెడ్డి గట్టిగా పోటీ పడ్డారు. కానీ నియోజకవర్గంలో బీసీల ఓట్లు ఎక్కువగా ఉండటంతో… బీసీ సామాజికవర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌ కు టికెట్‌ దక్కింది. అయితే ఈయనకు మల్‌ రెడ్డి రంగారెడ్డి వర్గం మద్దతుగా నిలవలేదు. టికెట్‌ దక్కకపోవటంతో మల్‌ రెడ్డి కూడా ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. పైగా తన సోదరుడు మల్‌ రెడ్డి రాంరెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా నిలిపారు. దీంతో కాంగ్రెస్‌ ఇంటిపోరు రచ్చకెక్కినట్లు అయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఉన్న క్యామ మల్లేశ్‌ కు 36,865 ఓట్లు దక్కగా… స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న మల్‌ రెడ్డి రంగారెడ్డికి 37341 ఓట్లు రాగా… సెకండ్‌ ప్లేస్‌ లో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మంచిరెడ్డికి… 48,397 ఓట్లు రావటంతో… పది వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీలోని నేతలు… ఒకే తాటిపైకి వచ్చి పని చేస్తే…. ఫలితం మరోలా ఉండేదని ఇప్పటికి చాలా మంది అభిప్రాయపడుతుంటారు.2014 ఎన్నికల్లో చేజేతులా సీటును వదులుకోగా… ఇక 2018 ఎన్నికల్లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు పెట్టుకోవటంతో ఇబ్రహీంపట్నం సీటును టీడీపీ తీసుకుంది. 

ఈ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మల్‌ రెడ్డి రంగారెడ్డి… ఆగ్రహానికి లోనయ్యారు.పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా…. బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి పోటీ చేయగా… కాంగ్రెస్‌, టీడీపీ కూటమి అభ్యర్థిగా సామ రంగారెడ్డి రేసులో నిలిచారు. అయితే మంచిరెడ్డికి 72,581 ఓట్లు రాగా… బీఎస్పీ నుంచి బరిలో ఉన్న మల్‌ రెడ్డి గట్టి పోటీనిచ్చారు. 72,205 ఓట్లు సాధించగా… కేవలం 376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కూటమి అభ్యర్థిగా ఉన్న సామ రంగారెడ్డికి 18వేల ఓట్లు వచ్చాయి. నిజానికి మల్‌ రెడ్డి… కాంగ్రెస్‌ గుర్తుపై పోటీ చేస్తే… ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉండేది. ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ 2014, 2018 ఎన్నికల్లో సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నట్లు అయింది.గడిచిన రెండు ఎన్నికల్లో స్వయం తప్పిదాలతో గెలిచే సీటును వదులుకున్న కాంగ్రెస్‌… ఈసారి మాత్రం పక్కాగా అడుగులు వేస్తోంది. మల్‌ రెడ్డి రంగారెడ్డి నియోజకవర్గంలో గట్టిగా తిరుగుతున్నారు. ఈసారి విజయం తనదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆయనే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ బరిలో ఉండే ఛాన్స్‌ ఉంది. ఇక్కడ బీసీల ఓట్లు ఎక్కువగా ఉండటంతో…. ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉంది. ఇదే జరిగితే…. త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....