DS పరిస్థితి విషమం..

సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ); కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పీసీసీ మాజీ చీఫ్‌ ధర్మపురి శ్రీనివాస్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శ్వాస తీసుకోవటానికి డి. శ్రీనివాస్‌ ఇబ్బంది పడుతున్నట్లు సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం శ్రీనివాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్చారు. గత రెండు రోజులుగా వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. డీఎస్‌ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన అభిమానులు ఇప్పటికే సిటి న్యూరో ఆస్పత్రికి తరలివస్తున్నారు.డీఎస్‌ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంతకు ముందు ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. ఆ దెబ్బతో పక్షవాతానికి గురయ్యారు. మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా ఇదే సిటీ న్యూరో సెంటర్‌కు తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. కొద్ది రోజుల తర్వాత డీఎస్‌ కోలుకున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం డీఎస్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  డీఎస్‌ ఆరోగ్యంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు. డీఎస్‌ ఆరోగ్యంపై కాంగ్రెస్‌ కీలక నేతలు ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు.1948, సెప్టెంబరు 27న నిజామాబాద్‌ జిల్లాలో జన్మించిన డి.శ్రీనివాస్‌…నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డీఎస్‌ పొలిటికల్‌ కెరీర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సాగింది. పార్టీలో ఉన్నత పదవులను చేపట్టారు. 1989లో నిజామాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి…తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణ పై గెలుపొందారు.  తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన డీ శ్రీనివాస్‌ ను మంత్రి పదవి వరించింది. 1998లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పగ్గాలు చేపట్టారు. 1999లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణను ఓడిరచి రెండవసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశారు.2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.  2004లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్‌ పవార్‌ ను ఓడిరచి మూడవసారి శాసనసభకు ఎన్నికయ్యారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా.. డీఎస్‌ మాత్రం ఓటమి పాలయ్యారు. నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలలో డి.శ్రీనివాస్‌ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ చేతిలో ఓడిపోయారు. 2015, జూలై 2న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి… గులాబీ పార్టీలో చేరారు. కేసీఆర్‌ రాజ్యసభకు నామినేట్‌ చేశారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసే వరకు కూడా ఆ పార్టీలో ఉన్నా, కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.కొంతకాలానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరమయ్యారు. ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు.. ఒకరు సంజయ్‌, మరోకరు అరవింద్‌. సంజయ్‌ కార్పొరేటర్‌ విజయం సాధించి…నిజామాబాద్‌ మేయర్‌ గా పని చేశారు. మరో కుమారుడు ధర్మపురి అర్వింద్‌ బీజేపీలో చేరి, ఎంపిగా విజయం సాధించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....