జగిత్యాల సెప్టెంబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ); జిల్లా లోని మెటుపల్లి మండలం మెట్ల చిట్టాపూర్ రైతులకు హై కోర్టులో వూరట లభించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ, పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల పనులు ఆపాలని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ’’హై కోర్ట్’’ స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. అట్టి ఆదేశాల ప్రతులతో పాటు పనులు నిలిపివేయాలని తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, జె.ఎ.సి. నాయకుల అధ్వర్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అందజేశారు.మెట్ల చిట్టపూర్ శివారులోని సర్వే నం.498, 506 లలో ఆ ప్రాంత నిరుపేద రైతులకు గత ప్రభుత్వాల హయాంలో భూ పట్టాలు పంపిణీ చేశారు. ఆనాటి నుండి నేటి వరకు ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు తెలియకుండానే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ, పుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పేందుకని నేటి ప్రభుత్వం పన్నాగం పన్నింది. రైతులకు పంచిన భూములను తిరిగి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆప్రాంత నిరుపేద రైతులు ఉన్న కొద్దిపాటి భూములను కోల్పోతున్నామని, మమ్ములను ఆదుకోవాలని గత కొంత కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించక పోవడం వలన భూ నిర్వాసితులు అయిన 25 కుటుంబాల రైతులు తెలంగాణ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు. బాధిత రైతుల పక్షాన వాదనలు విన్న హై కోర్టు తగు విచారణ జరిపి ‘‘స్టేటస్ కో’’ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని విషయాలను, రైతులందరి సమస్యలను, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. తదుపరి తీర్పు ఇచ్చేంత వరకు అక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు, భూముల సేకరణ పనులు నిలిపివేయాలని తెలంగాణ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అట్టి ఆదేశాల ప్రతులను జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెట్ల చిట్టాపూర్ గ్రామ రైతులు మంగళ వారం తెలంగాణ జనసమితి అధ్వర్యంలో అందజేశారు. ఆ బాధిత రైతులు మాకు తగిన న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట శంకర్, యువజన సమితి జిల్లా అధ్యక్షులు కంతి రమేష్, విద్యార్థి జనసమితి రాష్ట్ర కార్యదర్శి తరుణ్, జె.ఎ.సి.నాయకులు చింతకుంట దేవేందర్, పులి సంజీవ్, ఒడ్డన్న, గొర్రె భీమన్న, మెంగ సంజీవ్, నర్సయ్య, మహిళా రైతులు, బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.