హైదరాబాద్, జూలై 6, (ఇయ్యాల తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సమావేశం ప్రారంభానికి ముందే ప్రధాన కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు. అనంతరం శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. నిరసనలతో కొద్ది నిమిషాల్లోనే విూటింగ్ గందగోళంగా మారింది. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఆమె పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని.. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్‌ఎస్ పార్టీ అని మేయర్ అన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు. విూటింగ్ 15 నిమిషాలు వాయిదా వేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగా.. నేతలు తమ పరిధిలోని సమస్యలను ఏకరవు పెట్టారు.బల్దియా కౌన్సిల్ సమావేశానికి కాంగ్రెస్ , బీఆర్‌ఎస్, ఎంఐఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. కాగా, మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమయ్యారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత, మరికొంత మంది కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో వీరి రాజీనామాకు పట్టుబట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు చెందిన గ్రేటర్ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని నిర్దేశించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్, ఇతర సమస్యలపై బహిరంగంగా ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమయ్యారు. 150 మంది కార్పొరేటర్లలో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు. మరో ఇద్దరు ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం 47 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్ పదవికి విజయలక్ష్మీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని పోడియంను చుట్టుముట్టారు.
దీంతో సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ సభ్యుల దగ్గర సబ్జెక్టు లేదు.. అందుకే ఆందోళన చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ముందు పార్టీ పిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు..? విూకు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ మేయర్ ఫైర్ అయ్యారు.ఎంఐఎంకు 41 మంది, బీజేపీకి 39, కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులున్నారు. దాదాపు నాలుగున్నర నెలల తర్వాత జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సిద్ధమైంది. ఈ క్రమంలో సమావేశం ప్రారంభం కాగానే.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల నిరసనతో సభ రసాభాసగా మారింది. అనంతరం నగరంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని.. మేయర్ సహా అధికారులు చోద్యం చూస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర నేతలు సైతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని సమస్యలు ఏకరవు పెట్టారు. వానా కాలం సవిూపించినా నాలాల్లో పూడిక తీత పనులు జరగట్లేదని ఆందోళనకు దిగారు. చెరువులు కబ్జాకు గురవుతున్నాయని.. ఖాళీ పైపులు, గుర్రపు డెక్కలతో కొందరు కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు.