హైదరాబాద్, జూన్4, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో ఆరోగ్యకేంద్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వెనుకడుగు వేస్తున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్‌సీ) అత్యంత కీలకమైన మెడికల్ అధికారి పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నాడి పట్టే వైద్యులు లేక పేదలకు నానా అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నవారే అదనపు సెంటర్లలో వైద్య సేవలందిస్తున్నారు. మరికొన్ని కేంద్రాల్లో ఏఎన్‌ఎంలే చికిత్సనందిస్తుండటం గమనార్హం.పేదవాడికి జబ్బుచేస్తే వెంటనే గుర్తుకొచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. కేసీఆర్ పాలనలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు బస్తీ దవాఖానలు సైతం ఏర్పాటు చేసి పేదవాడి ఇంటి ముందే ఉచిత వైద్యం చేరవేశారు. జిల్లాలోని బస్తీవాసులు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నిరంతరం నాణ్యమైన వైద్యసేవలందించాయి. కానీ నేడు అవన్నీ సిబ్బంది కొరతతో స్వాగతం పలుకుతున్నాయి. హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో మొత్తం 85 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో కేవలం 45 మంది మెడికల్ అధికారులే ఉండటం గమనార్హం. ఎనిమిది నెలల కిందట జరిగిన బదిలీల్లో హైదరాబాద్ జిల్లాలోని 40 మంది మెడికల్ అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇక్కడి నుంచి బదిలీ చేసిన రాష్ట్ర సర్కార్ బదిలీ కారణంగా ఏర్పడ్డ ఖాళీలను నింపడంలో నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తున్నది.
ఈ కారణంగా ప్రస్తుతం ఒక్కో మెడికల్ అధికారి వారంలో మూడురోజులు విధులు నిర్వహిస్తున్న కేంద్రంలో, మరో మూడు రోజులు మెడికల్ అధికారి లేని సెంటర్‌కు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. దీని కారణంగా మెడికల్ అధికారులు అధిక పని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి యూపీహెచ్‌సీలో కనీసం ఒక మెడికల్ అధికారి, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నిషియన్, ఏఎన్‌ఎంలు విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ జిల్లాలో కీలకమైన మెడికల్ అధికారి పోస్టులే ఖాళీగా ఉన్నాయి.రోగి ఆరోగ్య పర్యవేక్షణలో మెడికల్ అధికారి పాత్ర కీలకం. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, సాధారణ జ్వరం నుంచి వ్యాధి నిర్ధారణ వరకు పలు సమస్యలకు మందులు సూచించడం, మాతా శిశు ఆరోగ్య కార్యక్రమం వంటి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం, చిన్న చిన్న గాయాలకు చికిత్సలందించడం, పోషకాహారం, వ్యాధి నివారణపై సలహాలు అందించడంతో పాటు ఇతర సిబ్బందిని ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సంబంధిత సెంటర్‌లో మెడికల్ అధికారి పోస్టు ఖాళీగా ఉండటం వల్ల ఆ సెంటర్‌లో సరైన పర్యవేక్షణ కూడా కరవైపోతున్నది.రోగాలబారిన పడి వైద్య పరీక్షల కోసమని యూపీహెచ్‌సీలకు వచ్చే రోగులు మెడికల్ అధికారి లేకపోవడంతో సరైన వైద్య పరీక్షలు చేయించు కోలేకపోతున్నారు. ఏఎన్‌ఎంలు ఇచ్చే మాత్రలు తీసుకొని నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖాళీలను భర్తీ చేయాల్సిన రాష్ట్ర సర్కార్ నేటికి చర్యలు చేపట్టని కారణంగా పేదవాడు ప్రభుత్వ వైద్యమంటే వెనకడుగు వేస్తున్న వైనం నెలకొంది. తమ ప్రాంతంలో ఉన్న యూపీహెచ్‌సీలో ఖాళీలను భర్తీ చేయాలంటూ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.