
హైదరాబాద్, మే 21 (ఇయ్యాల తెలంగాణ) : ఉపరితల ఆవర్తనం, అల్పపీడనద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలుచోట్ల బుధవారం మధ్యాహ్నం వర్షం మొదలైంది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, మారేడుపల్లి, మలక్పేట, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, కొత్తపేట, బేగంపేట, అల్వాల్, తిరుమలగిరిలో వర్షం కురుస్తోంది. భారీ వర్ష సూచనతో తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మే 22, 23, 24 తేదీల్లోనూ తెలంగాణకు వర్ష సూచన ఉంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మూడు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలున్నాయి. దాంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3`5 డిగ్రీలు తక్కువగా నమోదుకానున్నాయి. గంటకు 30`40 కి.విూ వేగంతో గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
దిగొస్తున్న పగటి ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. మిగతా చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి.
ఆదిలాబాద్ 41.3 డిగ్రీలు
భద్రాచలం 36 డిగ్రీలు
దుండిగల్ 33.6 డిగ్రీలు
హన్మకొండ 36.5 డిగ్రీలు
హైదరాబాద్ 35.7 డిగ్రీలు
ఖమ్మం 37.4 డిగ్రీలు
మహబూబ్ నగర్ 35 డిగ్రీలు
మెదక్ 34.2 డిగ్రీలు
నల్గొండ 37 డిగ్రీలు
నిజామాబాద్ 39 డిగ్రీలు
రామగుండం 38.6 డిగ్రీలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోనూ గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు , నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది