న్యూ ఢిల్లీ, మే 20 (ఇయ్యాల తెలంగాణ) : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈరోజు(సోమవారం)తో ముగిసింది. దీంతో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. అయితే కవితను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ, సీబీఐ అధికారులు హాజరుపరిచారు.సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్ జూన్3 వరకు కోర్టు పొడిగించింది. లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన తాజా ఛార్జ్ షీట్‌పై విచారణ కొనసాగుతోంది. తాజా ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారణ జరుపుతుంది. తాజా ఛార్జ్ షీట్లో కొన్ని అంశాలపై సీబీఐ అధికారులను జడ్జి కావేరి బవేజా వివరణ అడిగారు. 15 నిమిషాలు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.కాగా.. మార్చి 26 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో కవిత ఉన్న విషయం తెలిసిందే. ఢల్లీి మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోండటంతో కవితను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచారు. కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నించారు. ఇప్పటికే కోర్టు పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.