
ఈ ప్రాంతాల్లోనే, గజం ధర ఎంతంటే..?
హైదరాబాద్, జూన్4, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ మహానగరం చుట్టూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల విక్రయానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ ప్లాట్ల విక్రయ ప్రక్రియను ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు కు ఇరువైపులా ఉన్న ఇమ్ముల్నర్వ, ప్రతాప్‌సింగారం, తొర్రూరు, లేమూరు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతుల నుంచి భూములను సేకరించి హెచ్ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేసింది. ఈ ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించింది.హెచ్ఎండీఏ 60`40 నిష్పత్తిలో భూములను అభివృద్ధి చేసి 60 శాతం ప్లాట్లను భూములు ఇచ్చిన రైతులకు కేటాయించింది. మిగిలిన 40 శాతం ప్లాట్లు హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్నాయి. వీటిని ప్రస్తుతం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమయ్యారు. లేమూరులో 83 ఎకరాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లో మొత్తం 497 ప్లాట్లు ఉండగా.. 333 ప్లాట్లు రైతులకు కేటాయించారు. మిగిలిన 164 ప్లాట్లను హెచ్ఎండీఏ విక్రయించనుంది. ప్రతాప్సింగారంలో 165 ఎకరాల్లో విస్తరించి ఉన్న లేఅవుట్లో మొత్తం 1093 ప్లాట్లు అభివృద్ధి చేశారు. రైతులకు కేటాయించినవి పోగా.. 793 ప్లాట్లు హెచ్ఎండీఏ ఆధీనంలో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. తొర్రూరులో 117 ఎకరాల్లో అతిపెద్ద లేఅవుట్‌గా అభివృద్ధి చేయగా.. ఇందులో 985 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అమ్ముడుపోగా.. ప్రస్తుతం 493 ప్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్లాట్లకు గజానికి కనీస ధర రూ.20`30 వేలపైనే ఉండవచ్చని అంచనా. అత్యధిక ధర కోట్ చేసిన వారికి ప్లాట్లను వేలం ద్వారా విక్రయించనున్నారుప్రస్తుతం స్థిరాస్తి రంగంలో కొంత స్తబ్దత నెలకొన్నప్పటికీ.. హైదరాబాద్ మార్కెట్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదని రియల్ ఎస్టేట్ నిపుణులు, అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ ప్లాట్లకు మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నారు. ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చే నిధులను నగర అభివృద్ధి పనులకు మళ్లించాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది.