శ్రీరాముడి దాసుడు హనుమంతుడు. ‘ఓ రామదూతా! నీకు నమస్సులు’ అనే భావోద్వేగంతో ఎంతోమంది భక్తులు హనుమంతుడిని సేవిస్తుంటారు. భగవత్ సేవకు కావాల్సిన అహేతుకమైన నిబద్ధత, అపారమైన శక్తి, అమితమైన భక్తి, అచంచలమైన దాస్యభావం ఆంజనేయుడి సొంతం. రామనామాన్ని స్మరించడం వల్లే ఆయన చిరంజీవిగా నిలిచాడు.
హనుమంతుడు ఎంతో శక్తిమంతుడే కాదు, భక్తిపరంగా అత్యుత్తముడు. భగవంతుడి దాసునిగా జీవించడం వల్లే ఆయన మహోన్నతిని సాధించాడు. నవవిధ భక్తి మార్గాల్లో ‘దాస్యం’ అనే అంగానికి ప్రతీకగా భాగవతంలో హనుమంతుడిని ప్రస్తావిస్తారు. ‘హనుమంతుడు చేసింది ఒక్కటే.. శ్రీరాముడు చెప్పిన విధంగా సేవచేయడం. ప్రశ్నించలేదు, ఆలస్యం చేయలేదు. రాముడు చెప్పిన పనిని శిరసావహించి చేశాడు. లక్ష్మణుడికి ఔషధం తెచ్చే పని అప్పగించగానే.. పర్వతాన్ని ఆసాంతం తీసుకురావడం, రావణుడి నగరాన్ని ధ్వంసం చేయడం ఇలా ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. సర్వదా రామదాసుడిగా ఉండాలనే కోరుకున్నాడు హనుమ. ఆయన మోక్షం కోరుకున్నవాడు కాదు. సర్వలోకాధికారాన్ని ఆశించలేదు. ఆయన కోరుకున్నది ఒక్కటే.. శ్రీరాముడి సేవ చేసే అవకాశమే తరతరాలకు దక్కాలి’ అని శ్రీల ప్రభుపాదుల వారు ఆంజనేయుడి రామభక్తిని చాటారు.ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి.
భవబంధచ్చిదే తస్మై స్పృహయామి న ముక్తయే
భవాన్ ప్రభురహం దాస ఇతి యత్ర విలుప్యతే
(చైతన్య చరితామృత, ఆది లీల 6.42)
‘ఓ ప్రభూ! మోక్షం ప్రసాదించాలనుకుంటే ప్రసాదించండి. కానీ, నేను మాత్రం విూ దాస్యభావాన్ని కోల్పోవడాన్ని మాత్రం అస్సలు ఆశించను’ అని కోరాడట హనుమ. అంతటి దాస్యభక్తి వీరాగ్రణి ఆంజనేయుడు. ఒకసారి శ్రీరాముడు అగస్త్యమునితో.. ‘వాలి, రావణుల శక్తులు.. హనుమంతుడి బలానికి సమానంగా రావు. శక్తి, బుద్ధి, సహనం, ధైర్యం, విజ్ఞానం` ఇవన్నీ ఆంజనేయుడిలో సమపాళ్లలో ఉన్నాయి. లంకను జయించి, సీతామాత సందేశాన్ని తెచ్చిన ఘనత పూర్తిగా అంజనీపుత్రుడిదే’ అని అన్నాడట. రామాయణ, భాగవతాది శాస్త్రాల్లో హనుమంతుడి అసామాన్యమైన సాహసోపేత కృత్యాలెన్నో కనిపిస్తాయి. వాస్తవానికి అసంఖ్యాకమైన హనుమంతుడి లీలలను వర్ణించడం మనకు సాధ్యం కానిది. అయితే, నిత్యం శ్రీరాముడి గుణగణ వైభవాన్ని స్తుతించడం హనుమలో ఒక గొప్ప గుణంగా అభివర్ణించవచ్చు. ఎక్కడ శ్రీరామకథా గానం చేస్తారో.. అక్కడ హనుమంతుడు కూడా ఆసీనుడై భక్తుల సేవా సంకల్పాన్ని మరింత బలపరుస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్
రామనామ గానం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడన్నది భక్తుల నమ్మకం. ఈ భక్తాగ్రేసరుడు భక్తకోటికి విలువైన సూచన చేశాడని భాగవతం ద్వారా తెలుస్తుంది.
సురోవసురో వాప్యథ వానరో నరః
సర్వాత్మనా యః సుకృతజ్ఞముత్తమమ్
భజేత రామం మనుజాకృతిం
హరిం య ఉత్తరాననయత్కోసలాన్దివమితి
(శ్రీమద్భాగవతం 5.19.8)
‘సురులు గానీ, అసురులు గానీ, నరులు గానీ, వానరులు గానీ, మానవమాత్రునిగా ఈ లోకంలో అవతరించిన దేవాదిదేవుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధించాలి. భక్తుడు ఆచరించే తృణమాత్రపు సేవనైనా ప్రేమతో స్వీకరించే ఆ స్వామిని సేవించడానికి కఠోర తపస్సులు ఆచరించ అవసరం లేదు. భగవంతుడు ప్రీతి చెందితే, తన భక్తుడికి సార్థకత చేకూరినట్టే. రామచంద్రుడు అయోధ్య వాసులందరికీ తన స్వధామాన్ని (వైకుంఠాన్ని) అనుగ్రహించాడు’ అని పలికిన హనుమంతుడి మాటలు రామభక్తులకు కొండంత బలాన్నిస్తాయి.
ఈ కలియుగంలో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యుత్తమ మార్గం హరినామ సంకీర్తన. ఆంజనేయుడిలా మనం కూడా సేవా దాస్యభావంతో
‘హరే కృష్ణ.. హరే రామ’ మహామంత్రాన్ని జపిద్దాం. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ ఈ మంత్రం ద్వారా మనం కూడా శ్రీరాముడి సవిూపాన్ని పొందగలం. హనుమంతుడి ఆశీస్సులతో మన భక్తి మరింత పరిపక్వమవుతుంది.