Telangana టీడీపీకి కొత్త జవసత్వాలు – పూర్వ వైభవం సాధ్యమేనా !

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ టీడీపీకి కొత్త జవసత్వాలు కల్పించేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్‌ పెట్టారు. ఆయన ఇప్పటికే మూడు సార్లు తెలంగాణ టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు. తాజాగా ఆదివారం కూడా మరో మారు ఇక్కడి నాయకులతో సమావేశమై చర్చించారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ పార్టీ, లోక్‌ సభ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ తమకు అనుకూలమైన నాయకత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం, టీటీడీపీని ముప్పుతిప్పలు పెట్టిన బీఆర్‌ఎస్‌ ఆత్మరక్షణలో ఉండడం, ఏపీలో తమ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు, ఎనిమిది లోక్‌ సభ స్థానాలను గెలుచుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీకి పునర్‌ వైభవం తీసుకురావడానికి సరైన సమయమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు పర్యాయాలు హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌ లో సమావేశం అయ్యారు.తెలంగాణలో టీడీపీకి మంచి బేస్‌ ఉంది. 

ఇప్పటికీ కార్యకర్తల బలం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా 2014 ఎన్నికల్లో, ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. కానీ, బీఆర్‌ఎస్‌ చేసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ వల్ల టీటీడీపీకి కుదేలు అయ్యింది. ప్రధానంగా రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు తర్వాత టీటీడీపీని వీడిన నాయకులు ఎక్కువయ్యారు. తెలంగాణ టీడీపీ శాసనసభా పక్షాన్ని కూడా అప్పటి టీటీడీపీ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు బీఆర్‌ఎస్‌ లో విలీనం చేశారు. శాసనమండలిలో సైతం ఎమ్మెల్సీలు అంతా టీటీడీపీని వీడి బీఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీని వీడారు. అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.రమణ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా ఉన్న రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలుకు వెళ్లారు. ఆ తర్వాత రేవంత్‌ టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.పార్టీకి బలమైన నాయకులుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రేవంత్‌ రెడ్డి, ఎల్‌.రమణ బయటకు వెళ్లిపోవడంతో పార్టీకి దిక్కులేకుండా పోయింది. కొన్నాళ్లకు జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. కొన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఆయన తెలంగాణ టీడీపీని గాడిన పెట్టలేకపోయారు. 

2014లో గెలిచిన పదకొండు ఎమ్మెల్యేల్లో పది మంది బీఆర్‌ఎస్‌ లో విలీనం కాగా, 2018 గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. దీంతో 2023 ఎన్నికల్లో పోటీ చేసే సాహసాన్ని ఆ పార్టీ చేయలేక పోయింది. ఏపీలో రాజకీయ భవిష్యత్తు, తిరిగి అధికారంలోకి రావడంపై దృష్టి పెట్టిన చంద్రబాబు తెలంగాణ టీడీపీకి పెద్దగా ప్రియారిటీ ఇవ్వలేదు. తెలంగాణలో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ కూడా పార్టీని వీడి బీఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. ఆయన లోక్‌ సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా.. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోవడంతో తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్‌ అయ్యింది.తెలంగాణలో పార్టీకి కొత్త రక్తం ఎక్కించేందుకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టారు. పార్టీలో నాయకులంతా క్యూకట్టి ఇతర పార్టీలోకి వెళ్లిపోయినా, ఇక్కడా ఇంకా కొంత ఓటు బ్యాంకు ఉందని, కార్యకర్తల బలం ఉందన్న బలమైన నమ్మకంతో తెలంగాణలో టీడీపీకి పునర్‌ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికోసం కొత్త ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఎలా ముందుకు సాగాలనే అంశంపై ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌ లో చంద్రబాబు స్థానిక నాయకులతో చర్చించారు. 

దీనిలో భాగంగానే ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కమిటీల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతల్లో ఉండడం, తమను ఇబ్బంది పెట్టిన బీఆర్‌ఎస్‌ ఆత్మరక్షణలో పడిపోవడం, ఏపీలో అదే మాదిరిగా, కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీ తెలంగాణలో కొంత మెరుగైన స్థితిలో ఉండడం వంటి సానుకూల అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణలో టీడీపీని తిరిగి పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నారు.తెలంగాణకు ఇక ప్రతీ 15 రోజులకొకసారి వస్తానని చంద్రబాబు కార్యకర్తలకు మనోధైర్యం చెబుతున్నారు. కొద్ది నెలల్లోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానిక ఎన్నికల వేదికగా తిరిగి అరంగేట్రం చేయడం ద్వారా ఉనికి చాటుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు. దాదాపు నామ రూపాల్లేకుండా పోయిన టీడీపీ తిరిగి తెలంగాణలో పుంజుకుంటుందా? ఆ పార్టీకి తిరిగి పునర్‌ వైభవం వస్తుందా? అన్న అంశం ఆసక్తికరంగా మారాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....