Telangana లో హోరా హోరీగా MLC ఎన్నిక..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో మూడు స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఎన్నడూలేని విధంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయపార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుండటంతో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ రేపుతోంది. రెండు టీచర్స్‌ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానానికి ఎన్నిక జరుగుతుండగా అందరి దృష్టి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రల స్థానంపై నెలకొంది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు బీఎస్పీ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థి మధ్యనే ప్రధానపోటీ నెలకొంది. ప్రయివేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ మద్దతుతో పోటీలో ఉన్న మరో అభ్యర్థి కూడా వివిధ పార్టీల అభ్యర్థులతో సమానంగా పోటీపడుతున్నారట. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే సమయంలో బీజేపీ సైతం గెలుపే లక్ష్యంగా పనిచేసింది. ఆ పార్టీకి చెందిన నలుగు ఎంపీలు బీజేపీ అభ్యర్థి కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ తరపున ఏకంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. విద్యావంతులైన పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్న నేపథ్యంలో గెలుపు ఎవరిదనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాజకీయ పార్టీల తరపున అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఓటర్లు తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదాన్ని గట్టిగా వినిపిస్తుండటంతో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారనేది ఆసక్తిగా మారింది.

ఒకచోట కాంగ్రెస్‌, మూడు చోట్ల బీజేపీ,

కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండుచోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీచేస్తుండగా, కాంగ్రెస్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రమే పోటీచేస్తోంది. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి పోటీలో ఉండగా.. కాంగ్రెస్‌ అభ్యర్థిని పెట్టలేదు. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయసంఘాల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. రాజకీయ ప్రాధాన్యతకంటే యూనియన్ల ప్రభావం ఎక్కువుగా ఉండటంతో ఈ రెండుచోట్ల ఎవరు గెలుస్తారనే విషయానికి అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఉపాధ్యాయసంఘాల నేతల్లో చీలిక రావడంతో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇక ఎక్కువమంది ఓటర్లు ఉన్న పట్టభద్రుల స్థానంలో మాత్రం చతుర్ముఖ పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి మధ్య నువ్వా`నేనా అన్నట్లు పోటీ ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వైపు ఎక్కువ యువత ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

50 మందికి పైగా:

పోటీలో 56మందికి అభ్యర్థులు ఉన్నప్పటికీ నలుగురు అభ్యర్థుల మధ్య ప్రధానపోటీ నెలకొంది. ఈ నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు కాగా, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి ప్రత్యక్షంగా విద్యారంగంతో సంబంధం లేదు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం స్టడీ మెటిరీయల్‌ తయారీలో నైపుణ్యం ఉన్న ప్రసన్న హరికృష్ణకు గ్రాడ్యుయేట్లలో మంచి పేరుందనే చర్చ జరుగుతోంది. దీంతో రెండు లేదా మూడో ప్రాధాన్యత ఓటుతో అయినా ప్రసన్న హరికృష్ణ గెలుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రసన్న హరికృష్ణ చివరి వరకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ అధిష్టానం నరేందర్‌ రెడ్డి వైపు మొగ్గుచూపడంతో ఆయన బీఎస్పీ నుంచి పోటీలో ఉన్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీగా పోటీచేయాలనే ఉద్దేశంతో ఏడాది నుంచే ప్రసన్న హరికృష్ణ నాలుగు జిల్లాల్లో గ్రాడ్యుయేట్లను కలవడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో ఇప్పటికే గ్రాడ్యుయేట్‌ ఓటర్లను ఆయన నేరుగా కలిసి ఓట్లను అభ్యర్థించారు. నలుగురు అభ్యర్థులతో పోలిస్తే ప్రసన్న హరికృష్ణ పేరు పట్టభద్రుల్లో గట్టిగా వినిపిస్తోందనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో పార్టీ బలం అంజిరెడ్డి, నరేందర్‌ రెడ్డికి ప్లస్‌గా భావిస్తున్నారు. ప్రయివేట్‌ స్కూల్‌ అసోసియేషన్‌ మద్దతుతో పోటీలో ఉన్న శేఖర్‌ రావు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీంతో గెలుపుపై నలుగురు అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.

ఫలితం కోసం:

కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల స్థానం నుంచి ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశం లేదనేది సుస్పష్టం. నలుగురు అభ్యర్థుల మధ్య ప్రధానపోటీ నెలకొని ఉండటంతో మూడు లేదా నాలుగో ప్రాధాన్యత ఓటుతో మాత్రమే ఫలితం తేలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులైన అంజిరెడ్డి, నరేందర్‌ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు కచ్చితంగా రెండు లేదా మూడో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేసే అవకాశం ఉంటుంది. ప్రసన్న హరికృష్ణ గతంలో కాంగ్రెస్‌ సానుభూతిపరుడిగా ఉండటంతో కాంగ్రెస్‌కు తొలి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేసే అవకాశం ఉంది. అదే సమయంలో అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్‌ కంటే ప్రసన్న హరికృష్ణకు వేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన అభ్యర్థులు రెండో ప్రధాన్యత ఓటును కచ్చితంగా నరేందర్‌ రెడ్డికి వేస్తారని చెప్పలేని పరిస్థితి. ఆ ఓటర్లు రెండుగా చీలి నరేందర్‌ రెడ్డి, అంజిరెడ్డికి వేసే అవకాశం ఉంది. దీంతో రెండు లేదా మూడో ప్రాధాన్యత ఓటుతో గెలుస్తాననే విశ్వాసాన్ని ప్రసన్న హరికృష్ణ వ్యక్తం చేస్తున్నారు. శేఖర్‌ రావు సైతం మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికంగా పొందే అవకాశం ఉంటుంది. శేఖర్‌రావుకు ఓటు వేసిన ఓటర్లలో ఎక్కువమంది రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేసే అవకాశం లేకపోలేదు. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్లను ఎక్కువుగా బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు సాధించినప్పటికీ రెండో ప్రాధాన్యత ఓటుతో ప్రసన్న హరికృష్ణ ప్రధాన పార్టీ అభ్యర్థులకు షాక్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది   మార్చి3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడిస్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....