Telangana సాయుధ పోరాటయోధుడు – బోమ్మగాని ధర్మభిక్షం

సాయుధ పోరాటయోధుడు – కమ్యూనిస్టు నాయకుడు బోమ్మగాని ధర్మభిక్షం

`నేడు ఆయన జయంతి  

ధర్మభిక్షం విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ప్రవేశించారు. పాఠశాల దశలోనే తోటి విద్యార్థులను చైతన్యపరచి, నిజాం నవాబు జన్మదిన వేడుకలను బహిష్కరించిన తీరు అప్పట్లో పెద్ద సంచలనమైంది. 1922 ఫిబ్రవరి 15న సూర్యాపేటలో బొమ్మగాని ముత్తిలింగం గౌడ్‌, గోపమ్మ దంపతులకు జన్మించిన భిక్షం నల్లగొండ జిల్లాలో తొలి విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. సూర్యాపేటలో ఆర్యసమాజంతో పాటు 1940లోనే తొలి విద్యార్థి హాస్టల్‌ను నిర్వహించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ హాస్టల్‌ ప్రథమ వార్షకోత్సవ సభకు హాజరైన హైదరాబాద్‌ కోత్వాల్‌ రాజ్‌ బహుదూర్‌ వెంకట్రామిరెడ్డి ఆయనను తొలిసారి ధర్మభిక్షంగా సంబోధించారు. ఒక చేతితో దానమడుగుతూ రెండో చేత్తో ధర్మం చేస్తున్న వ్యక్తి కేవలం భిక్షం కాదు ధర్మభిక్షం అని పేర్కొనడంతో ఆనాటి నుంచి ఆయన పేరు ధర్మభిక్షంగా స్థిరపడిపోయింది. నల్లగొండ జిల్లాలో మొదటిసారిగా కార్మికసంఘాన్ని, కమ్యూనిస్టు సెల్‌ను స్థాపించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ధర్మభిక్షం చట్టసభల్లో పీడిత ప్రజల గొంతుక వినిపించారు. 1952లో సూర్యాపేట నుంచి, 1957లో నకిరేకల్‌ నుంచి పీడీఎఫ్‌ తరపున, 1962లో నల్లగొండ నుంచి కమ్యూనిస్టు పార్టీ తరపున శాసనసభలో ప్రాతినిథ్యం వహించారు. 1991, 1996లో సీపీఐ అభ్యర్థిగా నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రజాపోరాటాలకు సూర్యాపేటతో పాటు నల్లగొండ జిల్లాను కేంద్ర బిందువుగా మార్చడంలో ధర్మభిక్షం సాగించిన కృషి స్ఫూర్తి దాయకమైనది. సామాన్య రైతు కూలీలతో పాటు విద్యావంతులు, ఉద్యోగులు, మహిళలను కూడా పెద్ద సంఖ్యలో ఉద్యమంలోకి ఆకర్షించి, కమ్యూనిస్టు పార్టీని అగ్రభాగాన నిలబెట్టడంలో చేసిన కృషి మరువలేనిది. కల్లుగీత కుటుంబంలో జన్మించిన ధర్మభిక్షం కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి శ్రమించారు. 

దున్నేవాడిదే భూమి అన్నట్టుగా గీసేవాడిదే చెట్టు అన్న నినాదం ఇచ్చి వారి హక్కుల కోసం పోరాడారు. ఆయన సాగించిన కృషి ఫలితంగానే ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోయిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా అమలులోకి వచ్చింది. ప్రజా ఉద్యమ క్షేత్రంలో, చట్టసభల్లోనూ పేదల పక్షాన నిలబడి, వారి తరఫున కలబడిన ధర్మభిక్షం  89 ఏళ్ళ వయసులో ఇంట్లో జారి పడటంతో ఆయన తుంటి ఎముకకు దెబ్బతగిలింది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న శస్త్రచికిత్స జరిపారు. తర్వాత తేరుకున్నప్పటికీ ఉపిరితిత్తుల సమస్య జఠిలం కావటంతో చికిత్స పొందుతూ 2011, మార్చి 26న  తుదిశ్వాస విడిచారు. ఆయన అవివాహితుడు సోదరుని కుమారున్ని దత్తత తీసుకున్నారు.ప్రజల మనిషిగా సామాన్య జీవితం గడిపిన ధర్మభిక్షం అందరికీ ఆదర్శప్రాయుడు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....