గ్రూప్ 1 అభ్యర్థుల – వయో పరిమితిని 46 ఏళ్ళు :
తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల ుూఖూఅ ప్రక్షాళన ఆలస్యమైందని.. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదని అన్నారు.తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని.. అయినా ఆ పార్టీ అధినేత అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆయన శాసనసభకు వచ్చి తమ ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 9 నాటికి తమ ప్రభుత్వం 2 నెలలు పూర్తి చేసుకుందని.. ఈ కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. త్వరలోనే మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు వేశామని.. ప్రతిపక్షం సహకరించకున్నా ప్రజా పాలన అందిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు ఆందోళన అవసరం లేదని.. ఇచ్చిన హావిూ మేరకు ఉద్యోగాల కల్పన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘త్వరలోనే పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యూనివర్శిటీల వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశాం. వర్శిటీల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం. ఇప్పటికే 80 శాతం పెన్షన్లు అందించాం. మిగతా 20 శాతం కూడా 15 రోజుల్లో ఇచ్చి పెన్షనర్లను ఆదుకుంటాం. నియోజకవర్గ సమస్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే వారిని అనుమానిస్తున్నారు. సీఎంగా అందరినీ కలవడం, వాళ్ల సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. బీఆర్‌ఎస్ పద్ధతిలో నేను చేయను. గతపు ఆనవాళ్లను సమూలంగా ప్రక్షాళన చేసే బాధ్యత నాది.’ అని పేర్కొన్నారు.