సెప్టెంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ ): అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్నిప్రతి యేటాది సెప్టెంబరు 21న జరుపుతుంటారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం మేరకు 1982 సెప్టెంబరు 21వ తేదీ నుంచి ఈ శాంతి దినోత్సవాన్ని జరుపుతూ వస్తున్నారు. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు లేకుండా శాంతియుత జీవనానికే ప్రజానీకం మొగ్గుచూపుతోంది. శాంతి దినోత్సవం రోజున కపోతాలు (తెల్లని పావురాలు) ఎగురవేసి శాంతిపట్ల తమకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంటారు అనేక దేశాధినేతలు. వ్యక్తులు, సంస్థలు, దేశాలు ప్రపంచ శాంతికోసం తమ వంతు ప్రయత్నాలు, ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి అంతర్జాతీయ శాంతి దినోత్సవం పాటిస్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల నుంచి చిన్నారులు పంపిన నాణాలను కలిపి విరాళంగా వచ్చిన మొత్తంతో అసోసియేషన్ ఆఫ్ జపాన్ వారు ఐరాసకు ఒక గంటను బహూకరించారు. న్యూయార్క్‌లోని ఐరాస కేంద్ర కార్యాలయం ఆవరణలోని వెస్ట్కోర్ట్ తోటలో ఈ గంటను ఏర్పాటుచేశారు. ఏటా శాంతి దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలను ఈ గంటను మోగించిన తర్వాత దీని సవిూపంలోనే నిర్వహిస్తారు. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచానికి శాంతిని ప్రబోధించేలా శాంతి గంటను మోగిస్తారు. 1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా ఒక తీర్మానం సమర్పించింది. దాని ప్రకారం ఏటా సెప్టెంబర్ 21వ తేదిన ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రకటించింది.