హైదరాబాద్, డిసెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హావిూల్లో రూ.500లకే గ్యాస్ సిలిండర్ ప్రధానమైనది. ‘మహాలక్ష్మి పథకంలో భాగమైన సబ్సిడీ సిలిండర్ పంపిణీపై ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. తాజాగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై ఆ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకం వర్తింపచేసే అవకాశాలున్నట్లు సమాచారం. లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవడం ద్వారా సిలిండర్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయని ప్రతిపాదించినట్లు తెలిసింది. వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. అయితే, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది అమలు చేయాలంటే చాలా సమయం పడుతోందని, లబ్ధిదారుల ఎంపిక కష్టం అవుతుందని యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం కలెక్టర్లతో నిర్వహించే సమావేశంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే, ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఈ కేవైసీ చేసిన వారికే రూ.500 గ్యాస్ సిలిండర్ అనేది అపోహ మాత్రమేనని ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. కేంద్రం సూచనల మేరకు నవంబర్ నుంచే రాష్ట్రంలో కేవైసీ పరిశీలన జరుగుతోందని స్పష్టం చేసింది. గ్యాస్ సిలిండర్ ఈ కేవైసీకి సంబంధించి ఆఫీసులకు గుంపులుగా వచ్చి ఇబ్బందులు పడొద్దని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఓ ప్రకటన విడుదల చేశారు. డెలివరీ బాయ్స్ వద్దే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గ్యాస్ ఈ కేవైసీకి సంబంధించి కేంద్రం ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని, వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని తమకు ఆదేశాలు అందినట్లు చెప్పారు. డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ బాయ్స్ వద్ద ఎవరిదైనా పూర్తి కాకపోతే, అలాంటి వారు మాత్రమే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని తెలిపారు.